వాషింగ్టన్: అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన 97 ఏళ్ల జాన్ జాక్ బర్కిట్ తన 97వ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య అత్యంత ఘనంగా జరుపుకున్నారు. అందరితో కలిసి ఆనందంగా గడుపుతూ, ఫేమస్ పాప్ సాంగ్ ‘స్టేయింగ్ అలైవ్’ పాటకు ఉత్సాహంగా డాన్స్ చేస్తున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.
సందర్భానికి తగినట్టుగా సరదాగా డాన్స్ చేస్తున్న ఆ వృద్ధుడు ఒక్కసారిగా కిందపడిపోవడంతో అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు, అతిథులు షాక్కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు.
జీవితాంతం ఎంతో ఉత్సాహంగా, చురుగ్గా జీవించిన జాక్ బర్కిట్.. తాను ఎంతో ఇష్టపడే కుటుంబ సభ్యుల మధ్య, పుట్టినరోజే ఇలా కన్నుమూయడం పట్ల కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. అయితే, ఆయన ఆఖరి క్షణం కూడా ఎంతో సంతోషంగా, నృత్యం చేస్తూ గడపడం ఊరటనిచ్చే విషయమని వారు భావోద్వేగంతో పేర్కొన్నారు.
