బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి లేఅవుట్ల అభివృద్ధి: మంత్రి పొన్నం

బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి లేఅవుట్ల అభివృద్ధి: మంత్రి పొన్నం
  • 38 భవనాలకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవోలు
  • ఆయా కులాల నేతలకు జీవోలను అందజేసిన మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు: బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి 'రెడీ టు కన్‌‌‌‌స్ట్రక్షన్' విధానంలో లేఅవుట్లు అభివృద్ధి చేశామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మినిస్టర్ క్వార్టర్స్‌‌‌‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో 38 బీసీ కుల సంఘాల భవనాల కోసం రూ.88.50 కోట్లు మంజూరు చేసిన జీవో పత్రాలను ఆయా సంఘాల నేతలకు మంత్రి పొన్నం, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, కమిషనర్ బాలమాయదేవి అందజేశారు.

సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచనలతో నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామని.. కేటాయించిన భూములు వెనక్కి తీసుకుంటామనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఈ భవనాలు బీసీ విద్యార్థుల స్కిల్ డెవలప్‌‌‌‌మెంట్, వసతి, సామాజిక కార్యక్రమాలకు ఉపయోగపడతాయని తెలిపారు.

హైదరాబాద్ నగరంలో పద్మశాలి, పేరక, గౌడ, కాపు తదితర కుల సంఘాల వసతి గృహాల ద్వారా వేలాది మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారని మంత్రి గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతోనే 40 బీసీ కుల సంఘాలు, 36 సంచార జాతుల కులాలకు (మొత్తం 76 కులాలకు) ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం బడ్జెట్ శాంక్షన్ జీవోలను అందజేసిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చినట్లే.. జయంతులు, సభలు నిర్వహించుకోవడానికి సమగ్రంగా ఒక 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి ఉమ్మడి 'బీసీ భవన్' నిర్మించాలని ప్రభుత్వాన్ని జాజుల కోరారు. ఆత్మగౌరవ భవనాలకు నిధులు ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నంకు పద్మశాలి ఫెడరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, మున్నూరు కాపు చైర్మన్ బొమ్మ శ్రీరామ్ కృతజ్క్షతలు తెలిపారు.