బెంగళూరు: సర్ ప్రక్రియపై ఈసీ తీరును నిరసిస్తూ గురువారం ఇండియా కూటమి నేతలు ఆందోళనలు చేపట్టారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాటకీయ రీతిలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్టు చేస్తున్నట్లుగా ప్రదర్శన (మాక్ అరెస్ట్) చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారని కూటమి నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సీపీఐ, ఫార్వర్డ్ బ్లాక్, సమాజ్ వాదీ పార్టీలతో పాటు ప్రగతిశీల సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు పాల్గొన్నాయి.
కర్నాటక పీసీసీ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదాన్ వేదికగా సర్ప్రక్రియను, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి చేపట్టిన ఆందోళనల కొనసాగింపుగానే బెంగళూరులో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు స్పష్టం చేశారు.
ఓటర్ల జాబితా సవరణ పేరుతో భారీగా ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని, దీనివల్ల అర్హులైన పౌరులు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
