ముస్లిం విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఆపడం అన్యాయం: కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం

ముస్లిం విద్యార్థులకు  స్కాలర్‌షిప్‌లు ఆపడం అన్యాయం: కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: ముస్లిం విద్యార్థులకు కేంద్రం నాలుగేళ్లుగా స్కాలర్‌షిప్‌లు నిలిపివేయడం అన్యాయమని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అవకతవకలు, సీబీఐ విచారణ పేరుతో ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్‌షిప్‌లు ఆపడం సరికాదని పేర్కొన్నారు.

గురువారం దారుస్సలాంలోని ఎంఐఎం కార్యాలయంలో మజ్లిస్ చారిటీస్ ఎడ్యుకేషనల్ అండ్ రిలీఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టూడెంట్లకు ఫీజు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జీఈఆర్ 40 శాతం ఉండగా, ముస్లింలలో 33.60 శాతమే ఉందన్నారు. ఈ అంతరాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని కోరారు.

ముస్లిం విద్యార్థుల డ్రాపౌట్ రేటు ప్రాథమిక స్థాయిలో 8 శాతం, సెకండరీలో 6 శాతం, ఉన్నత విద్యలో 4 శాతంగా ఉందన్నారు. యూపీలో 2021-22 గణాంకాల ప్రకారం ఇవి వరుసగా 17.3, 12.6, 11.7 శాతంగా ఉన్నాయని తెలిపారు. బిహార్, యూపీ, పశ్చిమ బెంగాల్‌లో 300కు పైగా గ్రామాలకు స్కూళ్లు లేవన్నారు. 

విద్యార్థులకు స్కూల్ స్థాయిలోనే టీచర్లు ఉన్నత విద్య, కోర్సులపై అవగాహన కల్పించాలని సూచించారు. ట్రస్ట్ గత 21 ఏళ్లలో విద్యా కిట్లు, పరీక్ష ఫీజులు, పురస్కారాలు, స్టడీ మెటీరియల్ కోసం రూ.10.50 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.