ఏపీలోని కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం, మార్కాపురం, పల్నాడు జిల్లాల్లో ఏడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ మొదలైంది. రిగ్గింగ్, పోలింగ్ కేంద్రాలపై దాడి, బ్యాలెట్ బాక్సుల అపహరణ వంటి ఉద్రిక్తతలు చోటు చేసుకున్న క్రమంలో పోలింగ్ రద్దైన కేంద్రాల్లో శుక్రవారం ( నవంబర్ 6 ) రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది ఎన్నికల సంఘం. అనంతపురం జిల్లాలోని పెద్దవడుగూరు మండలం చిత్రచేడు గ్రామంలో 46, 47 పోలింగ్ కేంద్రాలు, మరుట్ల గ్రామంలో పోలింగ్ కేంద్రం 8 లో రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు ఎన్నికల కమిషనర్ పునేఠా.
కర్నూలు జిల్లా కోసిగి మండలం అర్లబండ గ్రామంలో రెండో నంబర్ పోలింగ్ కేంద్రంలో కూడా ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో పోలింగ్ రద్దు చేసి రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రూరల్ పొన్నాం గ్రామంలో రెండో నంబర్ పోలింగ్ కేంద్రం, మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం గంగవరం గ్రామంలో 5వ నంబర్ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ జరుగుతోంది.
పల్నాడు జిల్లా క్రోసూరు మండలం అండుగురు పోలింగ్ కేంద్రం 43లో కూడా ఉద్రిక్తతలు చోటు చేసుకున్న క్రమంలో పోలింగ్ రద్దు చేసిన ఎన్నికల సంఘం ఇవాళ రీపోలింగ్ నిర్వహిస్తోంది. ఎన్నికల సంఘం రీపోలింగ్ కి ఆదేశించిన అన్ని కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు మొదలైన రీపోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.
