- ఎల్‌జీబీటీక్యూ+ ఖైదీల కోసం ప్రత్యేక ఏర్పాటు
న్యూఢిల్లీ, వెలుగు: విభిన్న లైంగిక, జెండర్ గుర్తింపులున్న (ఎల్‌జీబీటీక్యూ+) ఖైదీల భద్రత కోసం హైదరాబాద్ సెంట్రల్ జైలులో ప్రత్యేకంగా ‘జెండర్ న్యూట్రల్ సెల్’ ఏర్పాటు చేశారు. ఈ మేరకు జైలు అధికారులు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కి నివేదిక అందజేశారు. దీనిపై కమిషన్ హర్షం వ్యక్తం చేస్తూ గురువారం ప్రకటన విడుదల చేసింది. విభిన్న జెండర్ గుర్తింపులు ఉన్న ఖైదీల ఆత్మగౌరవం, మానవ హక్కులను కాపాడేందుకు తీసుకున్న చర్యలను కమిషన్ అభినందించింది.
వారికి తగిన వసతులు కల్పించేలా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతించింది. గత నెల 8న ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పెషల్ మానిటర్ హైదరాబాద్ సెంట్రల్ జైలును సందర్శించారు. అక్కడ ట్రాన్స్‌జెండర్ ఖైదీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న చర్యలను పరిశీలించారు. కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని జైలు అధికారులకు సూచించారు.
ఈ మేరకు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో జైలు సూపరింటెండెంట్ కమిషన్‌కు నివేదిక సమర్పించారు. అందులో భాగంగా జెండర్ న్యూట్రల్ సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖైదీలు తమకు నచ్చిన దుస్తులు ధరించుకోవచ్చని పేర్కొన్నారు.
