మెదక్/సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని ప్యూర్ ఎనర్జీ ఈవీ స్కూటర్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీ వెనుకవైపు ఉన్న స్ర్కాప్షెడ్లో మంటలు అంటుకుని పక్కనే ఉన్న కంపెనీ భవనంలోకి వ్యాపించాయి. దీంతో కంపెనీలో ఉన్న సామగ్రి దగ్ధమై మంటలు ఎగిసిపడ్డాయి.
విషయం తెలుసుకున్న కంపెనీ యాజమాన్యం ఫైర్ స్టేషన్కు సమాచారం అందించింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నించగా తగ్గలేదు. దీంతో మరిన్ని ఫైరింజన్లు, స్థానికంగా ఉన్న వాటర్ ట్యాంకర్లు తెప్పించి దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ప్రమాద సమయంలో కంపెనీలో విధుల్లో ఉన్న నైట్ షిఫ్ట్ సిబ్బంది పక్క బ్లాక్లో ఉన్న బ్యాటరీలు, ఇతర సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో భారీ నష్టం తప్పింది. ఈ ఘటనపై కంపెనీ యాజమాన్య ప్రతినిధులను వివరణ కోరగా, కంపెనీకి ఆనుకుని ఉన్న స్క్రాప్ షెడ్లో మంటలు చెలరేగి, కంపెనీలోకి వ్యాపించడంతో అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలిపారు. సంగారెడ్డి రూరల్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
