సిద్దిపేట రూరల్, వెలుగు: ఆన్‌లైన్ క్యాసినో గేమ్స్‌కు బానిసై రూ.30 లక్షలు నష్టపోయిన ఓ వ్యక్తి, అప్పులు తీర్చేందుకు మహిళ మెడలోని ఆరు తులాల బంగారు పుస్తెలతాడును చోరీ చేశాడు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. గురువారం సిద్దిపేట ఏసీపీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన వివరాలు వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తాళ్లపల్లికి చెందిన నాంపల్లి మహేష్ సిద్దిపేట శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఏడు నెలలుగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ సుమారు రూ.30 లక్షలు నష్టపోయాడు. అప్పులు తీర్చేందుకు కుటుంబ సభ్యుల బంగారాన్ని ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టడంతోపాటు పలువురి వద్ద అప్పులు చేశాడు. ఈ క్రమంలో గతంలో కారు డ్రైవర్‌గా పరిచయమున్న కాలకుంట్ల రాం రాజేశ్వరం భార్య పెంటమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్నాడు.
బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో మాస్క్ ధరించి ఆమె ఇంటికి వెళ్లి తాగడానికి నీళ్లు అడిగాడు. ఆమె నీళ్లు ఇచ్చే సమయంలో మెడలో ఉన్న రూ.2.40 లక్షల విలువైన ఆరు తులాల బంగారు పుస్తెలతాడును బలవంతంగా తెంపుకొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు.
రంగీల ధాబా వద్ద నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేశారు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో అతడి వద్ద నుంచి ఆరు తులాల బంగారు పుస్తెలతాడు, కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రెస్మీట్లో వన్‌టౌన్ సీఐ మహేందర్ రెడ్డి, టూటౌన్ సీఐ మురళి, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ జాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
