మంచిర్యాల, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో దీపావళిని పురస్కరించుకుని దండారీ ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. గురువారం సిరికొండ మండలం రిమ్మ గ్రామంలో నిర్వహించిన దండారీ వేడుకల్లో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో మంద మకరంద్, ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
గిరిజన సంప్రదాయ పంచె, నెమలీకలతో కూడిన గుస్సాడీ టోపీ ధరించి ఆదివాసీలతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దండారీ ఉత్సవాలు ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలుస్తాయన్నారు. ఈ సంస్కృతిని భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
