కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి బొగ్గు గనుల్లో 35 ఏండ్లు కష్టించి పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కోల్‌మైన్స్ పెన్షన్ సకాలంలో అందక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రతి నెలా ఒకటి, రెండు తేదీల్లో ఖాతాల్లో జమ కావాల్సిన పెన్షన్ ఈ నెల ఐదో తేదీ వచ్చినా కొందరికి అందలేదు. దీంతో రిటైర్డు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పెన్షన్ చెల్లింపుల వ్యవస్థలో నోడల్ బ్యాంకుగా వ్యవహరిస్తున్న ఎస్‌బీఐ ధన్‌బాద్ కీలక పాత్ర పోషిస్తోంది. వివిధ బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన పెన్షనర్లకు సకాలంలో డబ్బులు అందేలా సమన్వయం చేయాల్సిన బాధ్యత నోడల్ బ్యాంకుపై ఉంది. అయినప్పటికీ పెన్షన్ ఐదో తేదీ వరకు జమ కాకపోవడంపై రిటైర్డు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా సింగరేణి రిటైర్డు ఉద్యోగులతో పాటు సుమారు లక్ష మందికి ఐదో తేదీ నాటికీ పెన్షన్ అందలేదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. సింగరేణి వ్యాప్తంగా సుమారు 90 వేల మంది కోల్‌మైన్స్ పెన్షన్ పొందుతున్నారు.
పెన్షన్ అనేది పదవీ విరమణ చేసిన కార్మికులకు వారి జీవితకాల శ్రమకు దక్కాల్సిన హక్కు అని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణుమాధవ్, జిల్లా సింగరేణి రిటైర్డు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య పేర్కొన్నారు. పెన్షన్ ఆలస్యానికి గల కారణాలను సీఎంపీఎఫ్, ఎస్‌బీఐ ధన్‌బాద్ నోడల్ బ్యాంకు ఆఫీసర్లు వెల్లడించాలని దీపావళికి ముందే పెన్షన్ అందేలా చూడాలని డిమాండ్ చేశారు.
