బనకచర్లకు నీటి లభ్యతపై అప్రైజల్..2023 హైడ్రాలజీ స్టడీ డేటానే మీరు ప్రామాణికంగా తీసుకున్నరు: సీడబ్ల్యూసీ

బనకచర్లకు నీటి లభ్యతపై అప్రైజల్..2023 హైడ్రాలజీ స్టడీ డేటానే మీరు ప్రామాణికంగా తీసుకున్నరు: సీడబ్ల్యూసీ
  • దాని ఆధారంగానే నీటి లభ్యతను అంచనా వేసినం
  • అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు?
  • సమ్మక్కసాగర్, సీతారామ ఎత్తిపోతలకు తెలంగాణ వాడిందీ అదే డేటా
  • రెండు రాష్ట్రాలూ ఆ డేటాకు అంగీకరించినట్లేనని లేఖ 

హైదరాబాద్, వెలుగు: పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు నీటి లభ్యతను తాము 2023 జూన్ నాటి హైడ్రాలజీ స్టడీ ఆధారంగానే అంచనా వేశామని, ఆ డేటాను ఏపీయే ప్రామాణికంగా తీసుకుందని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది. అప్పుడు ఎలాంటి అభ్యంతరం చెప్పని ఏపీ, ఇప్పుడు అదే నివేదికను ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించింది. 

గోదావరి, దాని ఉపనదుల్లో నీటి లభ్యతపై ఏపీ లేవనెత్తుతున్న అభ్యంతరాలకు గట్టి కౌంటర్ ఇస్తూ సీడబ్ల్యూసీ తాజాగా ఏపీకి లేఖ రాసింది. 2023 నాటి నివేదికను తెలంగాణ, ఏపీ రెండూ ఆమోదించినట్లేనని అందులో తేల్చిచెప్పింది. ఈ లేఖను తెలంగాణతో పాటు కృష్ణా, గోదావరి బోర్డులు, నేషనల్ వాటర్ డెవలప్‌‌‌‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌‌‌‌డబ్ల్యూడీఏ), కేంద్ర జలశక్తి శాఖకూ పంపింది.

ఏపీ అభ్యంతరం ఏంటంటే..

గోదావరి, దాని సబ్ బేసిన్లలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ 2023 జూన్‌‌‌‌లో హైడ్రాలజీ స్టడీ చేసింది. ఇందులో గోదావరిలో 1,486 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు తేలింది. 

అయితే 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా లోయర్ గోదావరిలో నీటి లభ్యత లేదన్న ఈ నివేదికను ఏపీ వ్యతిరేకించింది. మళ్లీ స్టడీ చేయించాలని జల వివాదాల పరిష్కారానికి రెండు రాష్ట్రాలతో ఏర్పాటైన కమిటీ మీటింగులో డిమాండ్ చేసింది.

అదే డేటా ఆధారంగా తెలంగాణ ప్రాజెక్టులు

దీనిపై స్పందించిన సీడబ్ల్యూసీ, బనకచర్లతో పాటు తెలంగాణకు చెందిన సమ్మక్కసాగర్, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుల నీటి లభ్యతను కూడా అదే నివేదిక ఆధారంగా అంచనా వేశామని లేఖలో వివరించింది. తెలంగాణ కూడా ఈ రెండు ప్రాజెక్టుల హైడ్రాలజీకి 2023 నాటి నివేదికనే ప్రామాణికంగా తీసుకుందని గుర్తుచేసింది. 

కాబట్టి ఆ నివేదికకు రెండు రాష్ట్రాలూ అంగీకారం తెలిపినట్లే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నివేదికపై ఇంకా ఏమైనా సందేహాలుంటే ఏపీ, తెలంగాణ అధికారులు సీడబ్ల్యూసీ ఆఫీసుకు వచ్చి చర్చించొచ్చని సూచించింది.