- గతంలో కన్నా ఎక్కువ నీటిని ఎత్తిపోసినం
- కాళేశ్వరం బ్యారేజీల భద్రతపై రాజీపడబోం
- డిసెంబర్లో మేడిగడ్డ రిపేర్లు ప్రారంభిస్తాం
- రూ.4,193 కోట్లతో బ్యారేజీల పునరుద్ధరణ పనులు
- నిర్మాణ లోపాల ఖర్చు కంపెనీలే పెట్టాలె
- నాడే తుమ్మిడిహెట్టి కడితే తెలంగాణకు కష్టాలుండేవి కావు
- నీటిపారుదల శాఖపై సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ కుంగితే గోదావరి నీళ్లన్నీ పూర్తిగా కిందికి వదలలేదని, దేవాదుల, సీతారామ లిఫ్టులను నడపడం ద్వారా గతంలోకన్నా ఎక్కువ నీళ్లు ఎత్తిపోసుకున్నామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మేడిగడ్డ వద్ద నీళ్లున్నా ఎత్తిపోయడం లేదంటూ బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు.
తెలంగాణ ప్రజల ఆస్తి అయిన కాళేశ్వరం బ్యారేజీల భద్రతపై రాజీపడబోమని, డిసెంబర్లో మేడిగడ్డ రిపేర్లు ప్రారంభిస్తామని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సంస్థలు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) నిపుణుల మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
దెబ్బతిన్న 3 బ్యారేజీలను వినియోగంలోకి తెచ్చేందుకు రూపొందించిన ప్రతిపాదనలపై గురువారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. దాదాపు రూ.4,193 కోట్ల అంచనా వ్యయంతో అధికారులు సిద్ధం చేసిన ప్రణాళికను పరిశీలించారు. ఇందులో నిర్మాణ లోపాల వల్ల వచ్చిన మరమ్మతుల ఖర్చును నిర్మాణ సంస్థలే భరించాలని, అదనపు రక్షణ పనుల వ్యయాన్ని మాత్రమే ప్రభుత్వం భరిస్తుందన్నారు.
నెలాఖరులోగా కేంద్రం నుంచి అన్ని రకాల తుది అనుమతులు సాధించి, డిసెంబర్ నాటికి పునరుద్ధరణ పనులను క్షేత్రస్థాయిలో ప్రారంభించాలని చెప్పారు. ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీధర్, టన్నెల్స్ అండ్ సేఫ్టీ కార్యదర్శి కల్నల్ పరీక్షిత్ మెహ్రా, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సాగు, తాగునీరందించాం
కాళేశ్వరం బ్యారేజీలు దెబ్బతిన్నప్పటికీ.. దిగువ గోదావరి జలాలు సముద్రంపాలు కాకుండా దేవాదుల, సీతారామ ఎత్తిపోతల ద్వారా గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎత్తిపోశామని, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఆయకట్టుకు సాగు, తాగునీటిని అందించామని సీఎం అన్నారు.
బీఆర్ఎస్ పాలనలో దేవాదుల ద్వారా ఏడాదికి సగటున 9.57 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేయగా.. తమ మూడేండ్ల పాలనలో ఏటా సగటున 18.13 టీఎంసీల నీళ్లు ఎత్తిపోశామని చెప్పారు. అక్టోబర్ నాటికే దేవాదుల ద్వారా 16.71 టీఎంసీలు, సీతారామ ద్వారా 8.10 టీఎంసీలు కలిపి మొత్తం 24.81 టీఎంసీల గోదావరి జలాలను సద్వినియోగం చేసుకున్నామని చెప్పారు.
క్వాలిటీలో రాజీపడొద్దు..
మేడిగడ్డ దెబ్బతిన్న నాటి నుంచి జాతీయ స్థాయి నిపుణులు, కేంద్ర సాంకేతిక సంస్థలతో సమగ్ర పరిశోధనలు చేయించామని, తమ పునరుద్ధరణ ప్రాథమిక ప్రణాళికలకు కేంద్ర నిపుణుల కమిటీ ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని అధికారులు వెల్లడించారు. బ్యారేజీల పునరుద్ధరణను 2 దశలుగా విభజించి.. మొదటి దశలో నీటి వినియోగ సామర్థ్యాన్ని పునరుద్ధరించడం, రెండో దశలో శాశ్వత రక్షణ పనులను చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు.
డ్యామ్ సేఫ్టీ ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని, పనుల్లో జాప్యం జరగకుండా అన్ని ప్రక్రియలను సమాంతరంగా నడపాలని సూచించారు. కేంద్ర జల సంఘం, ఎన్డీఎస్ఏ, నిర్మాణ సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, గత ప్రభుత్వ తప్పులు పునరావృతం కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలకు పటిష్ట రక్షణ కల్పించాలని ఇంజినీరింగ్ యంత్రాంగానికి స్పష్టం చేశారు.
ప్రస్తుతం మేడిగడ్డ వద్ద నీటిని లిఫ్ట్ చేయడం అసాధ్యం: ఇంజినీర్లు
ప్రస్తుతం మేడిగడ్డ వద్ద కిందికి వెళ్తున్న నీటిని సాంకేతికంగా లిఫ్ట్ చేయడం అసాధ్యమని ఇరిగేషన్ ఇంజినీర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీరు ఎల్లంపల్లికి చేరాలంటే మధ్యలో ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లను మూసి నిల్వ చేయాల్సి ఉంటుందన్నారు. కానీ, తీవ్ర నిర్మాణ లోపాలున్న అన్నారం, సుందిళ్ల గేట్లను మూస్తే బ్యారేజీలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని, వాటి గేట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తెరిచే ఉంచాలని ఎన్డీఎస్ఏ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు.
సీఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే మేడిగడ్డ కుంగిపోయిందని మండిపడ్డారు. గతంలోనే తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే, తెలంగాణకు కష్టాలుండేవి కావని, అతి తక్కువ ఖర్చుతో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎల్లంపల్లికి నీటిని తెచ్చుకునే అవకాశం ఉండేదని తెలిపారు.
