గోదావరి ఇసుక తిన్నెల వద్ద భద్రతా ఏర్పాట్లపై నివేదిక ఇవ్వండి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

గోదావరి ఇసుక తిన్నెల వద్ద భద్రతా ఏర్పాట్లపై నివేదిక ఇవ్వండి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: భద్రాచలం గోదావరి తీరంలోని ఇసుక తిన్నెల వద్ద ప్రమాదాల నివారణకు చేపట్టిన భద్రతా చర్యలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉగాది పండుగ సమయంలో ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయానికి చెందిన ఏడుగురు విద్యార్థులు గోదావరి నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాలను పరిశీలించిన జస్టిస్ నగేశ్ భీమపాక హైకోర్టుకు లేఖ రాశారు. విద్యార్థుల మృతి ఘటన ఏపీ పరిధిలో జరిగినప్పటికీ, గోదావరికి తెలంగాణ వైపు కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి. శ్యాంకోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వ న్యాయవాది మహేశ్ జె వాదనలు వినిపిస్తూ.. విద్యార్థుల మృతి ఘటన తర్వాత గోదావరి తీరంలో తెలంగాణ వైపు భద్రతా చర్యలు చేపట్టినట్టు వివరించారు. అయితే, తీసుకున్న చర్యల పూర్తి సమాచారాన్ని అఫిడవిట్ ద్వారా సమర్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.