- 27 సంస్థల పిటిషన్లు కొట్టివేత
హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు విద్యుత్తు ఉత్పత్తి సంస్థల నుంచి కరెంట్ కొనుగోలు చేసిన వ్యాపార సంస్థలు క్రాస్ సబ్సిడీ సర్‌చార్జి (సీఎస్ఎస్) చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. 2005–-06 నుంచి 2014–-15 మధ్య జరిగిన విద్యుత్తు కొనుగోళ్లకు ఈ చెల్లింపుల నుంచి మినహాయింపు ఉండదని తేల్చి చెప్పింది. ఈ మేరకు 27 వ్యాపార సంస్థలు, కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ నగేశ్ భీమపాక కొట్టివేశారు.
1948 నాటి విద్యుత్తు సరఫరా చట్టంలోని సెక్షన్ 43(ఏ)(సీ) కింద ప్రభుత్వం జారీ చేసిన జీవోలు కేవలం విద్యుత్తు ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఇచ్చినవేనని కోర్టు పేర్కొంది. వాటిని విద్యుత్తు సరఫరాకు ప్రత్యేక ప్రభుత్వ అనుమతులుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. కేంద్రం 2005లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సీఎస్ఎస్ మినహాయింపు పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి పత్రం తప్పనిసరిగా సమర్పించాలని, పిటిషనర్లు ఆ పత్రాలు ఇవ్వలేదని తెలిపింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు 2003 విద్యుత్తు చట్టం రాకముందే ప్రైవేటు విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు ఇతరులకు కరెంట్ సరఫరా చేసేవని, అప్పట్లో సీఎస్ఎస్ విధానం లేదని వాదించారు. 1997, 1998లో ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 93, 112 ప్రకారం మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే ఎస్పీడీసీఎల్ తరఫు న్యాయవాది ఎన్.శ్రీధర్‌రెడ్డి ఈ జీవోలు విద్యుత్తు ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు మాత్రమే ఇచ్చారని వాదించారు.
వాదనలు విన్న న్యాయమూర్తి.. విద్యుత్తు విక్రయానికి అనుమతి ఉండటం, ప్రభుత్వ సమ్మతి పొందడం రెండూ వేర్వేరు అంశాలని స్పష్టం చేశారు. 2007లో డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టినందున దానిని ఆధారంగా తీసుకోలేమన్నారు. దీంతో ఎస్పీడీసీఎల్ 2025లో జారీ చేసిన డిమాండ్ నోటీసులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేశారు.
