- ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖలు వెనుకంజ
- కేంద్రం, రాష్ట్ర వాటాల కింద రూ.20 వేల కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యం
- ఇప్పటివరకు రూ.10,855 కోట్లు జమ.. ఖర్చయింది రూ.6,982 కోట్లే
- గత సర్కార్ కేంద్ర నిధులు డైవర్షన్ చేయడంతో తాజాగా కేంద్రం కొర్రీలు
- నిధులు తేలేకపోయినా, వచ్చింది ఖర్చుచేయలేకపోయినా చర్యలు తప్పవు
హైదరాబాద్, వెలుగు: 2026–27 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) నిధుల సమీకరణ, ఖర్చును నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయా శాఖల సెక్రటరీలను రాష్ట్ర సర్కారు హెచ్చరించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో సీఎస్ఎస్ పథకాల కింద కేంద్ర, రాష్ట్ర వాటాలు కలిపి రూ.20 వేల కోట్ల నిధులు ఖర్చు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ రాష్ట్రానికి ఇప్పటివరకు సీఎస్ఎస్ కింద కేంద్ర వాటాగా రూ.6,686.93 కోట్లు, రాష్ట్ర వాటా కింద రూ.4,168.44 కోట్లు మొత్తం రూ.10,855 కోట్లు అందుబాటులోకి వచ్చాయి.
కానీ అందులో ఇప్పటివరకు కేవలం రూ.6,982 కోట్లు మాత్రమే ఖర్చు కావడంపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఖర్చు చేసిన మొత్తం నిధుల్లో కేంద్ర వాటా రూ.4,214 కోట్లు, రాష్ట్ర వాటా రూ.2,767 కోట్లుగా ఉంది. ఎప్పటికప్పుడు సీఎంఓ డ్యాష్ బోర్డులో సీఎస్ఎస్ నిధులను పర్యవేక్షిస్తున్న సీఎం, సీఎస్ కేంద్ర నిధులను పూర్తిస్థాయిలో రాబట్టడంలో అలసత్వం ప్రదర్శించే అధికారులను ఉపేక్షించేది లేదని తాజాగా మరోసారి హెచ్చరించారు.
ఆ శాఖల్లో 50 శాతం లోపే పనులు..
రాష్ట్రంలోని పలు కీలక శాఖల్లో కేంద్ర ప్రాయోజిత పథకాల వ్యయం 50 శాతంలోపే ఉన్నది. ఈ జాబితాలో ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా, రోడ్లు భవనాలు, ట్రాన్స్‌పోర్ట్, మైనార్టీ వెల్ఫేర్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్, అగ్రికల్చర్ అండ్ కో-ఆపరేషన్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (ఎంఏయూడీ), పర్యావరణ–అటవీ శాఖలు అట్టడుగున నిలిచాయి.
ఇరిగేషన్ శాఖ పరిధిలోని ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై), ఏఐబీపీ నిధులు.. ఆర్ అండ్ బీ శాఖకు వచ్చే సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్).. పంచాయతీరాజ్ శాఖలోని పీఎంఏవై–గ్రామీణ్, పీఎంజీఎస్‌వై రోడ్లు, స్వచ్ఛభారత్ మిషన్ పనలు నత్తనడకన సాగుతున్నాయి.
వైద్యారోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం), ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిధులు సైతం అనుకున్న స్థాయిలో ఖర్చు కావడం లేదు. మున్సిపల్ శాఖలో అమృత్, పీఎంఏవై–అర్బన్.. మైనార్టీ సంక్షేమంలో పీఎంజేవీకే నిధులను సకాలంలో ఖర్చు చేయకపోవడంతో కేంద్రం నుంచి మరో విడత నిధులు ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది.
పలు శాఖలు ముందంజ..
మౌలిక వసతులు, అభివృద్ధి శాఖలు నిధుల వ్యయంలో వెనుకబడినప్పటికీ.. సామాజిక సంక్షేమ రంగానికి చెందిన విభాగాలు ఈ విషయంలో ముందంజలో ఉన్నాయి. మొత్తం 21 విభాగాల్లో గిరిజన సంక్షేమ శాఖ (ట్రైబల్ వెల్ఫేర్), వెనుకబడిన తరగతుల సంక్షేమం (బీసీ వెల్ఫేర్), పరిశ్రమలు–వాణిజ్య శాఖ, ఎస్సీ అభివృద్ధి శాఖలు కేటాయించిన నిధులను సమర్థవంతంగా ఖర్చు చేసి ఈ జాబితాలో టాప్‌లో నిలిచాయి.
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎంఆర్‌ఎస్), పీఎం–జన్‌మన్ పథకాల నిధులను పక్కాగా గ్రౌండింగ్ చేశారు. బీసీ సంక్షేమంలో పీఎం–యశస్వి, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు.. ఎస్సీ అభివృద్ధి శాఖలో పీఎం–అజయ్ (పీఎం ఆదర్శ్ గ్రామ యోజన), హాస్టళ్ల ఆధునీకరణ నిధులను సకాలంలో లబ్ధిదారులకు చేరవేశారు.
పరిశ్రమల శాఖ సైతం కేంద్ర పథకాల నిధులను వేగంగా సమీకరించి ఖర్చు చేయడంలో సఫలమైంది. మైనార్టీ సంక్షేమం మినహా మిగిలిన అన్ని సంక్షేమ శాఖలు సీఎస్ఎస్ నిధుల వినియోగంలో ఆదర్శంగా నిలవడం విశేషం.
వెంటాడుతున్న గత ప్రభుత్వ తప్పిదాలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎస్ఎస్ పథకాలకు సంబంధించిన నిధులను ఇతర కార్యక్రమాలకు యథేచ్ఛగా దారిమళ్లించడమే (డైవర్షన్) ప్రస్తుత సమస్యలకు మూలకారణమని కేంద్రం వేలెత్తి చూపుతోంది. గత సర్కారు తప్పిదాలను సాకుగా చూపుతూ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రం విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది.
గతంలో విడుదల చేసిన నిధులకు సంబంధించి తక్షణమే వినియోగ ధ్రువీకరణ పత్రాలు (యూసీలు) సమర్పించాలని, లేదంటే ఆ నిధులను తిరిగి కేంద్రానికే వాపస్ పంపాలని స్పష్టం చేసింది.
దీనికి తోడు ప్రస్తుతం అమలవుతున్న ‘ఎస్ఎన్ఏ స్పర్ష్’ (సింగిల్ నోడల్ అకౌంట్ స్పర్ష్) విధానం ప్రకారం.. ముందే ఆయా స్కీములకు సంబంధించిన రాష్ట్ర వాటాను ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. అలా జమ చేసిన వెంటనే కేంద్రం తన వాటాను విడుదల చేస్తుంది.
మొత్తం రూ.6,982 కోట్ల వ్యయంలో.. ఎస్ఎన్ఏ స్పర్ష్ ద్వారా రూ.6,511 కోట్లు , సాధారణ ఎస్ఎన్ఏ ద్వారా రూ.470.79 కోట్లు ఖర్చయ్యాయి. ఈ నిబంధనల దృష్ట్యా అధికారులు వెంటనే మేల్కొని రాష్ట్ర వాటాను జమ చేయించి, కేంద్ర నిధులను రాబట్టాలని కూడా సీఎంవో ఆదేశించడం గమనార్హం.
