సీఈసీ తక్షణమే రాజీనామా చేయాలి: సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ

సీఈసీ తక్షణమే రాజీనామా చేయాలి: సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ

హైదరాబాద్, వెలుగు: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయని, ఆయనకు ఏమాత్రం నైతిక విలువలున్నా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

జ్ఞానేశ్ కుమార్ కేరళలో పీడబ్ల్యూడీ సెక్రటరీగా పనిచేసిన కాలంలో రూ.17 కోట్ల విలువైన పనులకు సంబంధించి ఒక కాంట్రాక్టర్ వద్ద రూ.2 కోట్ల లంచం డిమాండ్ చేశారని రామకృష్ణ ఆరోపించారు. బాధితుడైన కాంట్రాక్టర్ స్వయంగా ఫిర్యాదు చేయడంతో అప్పటి కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితాల విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్‌‌పై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు రావడం తీవ్రమైన విషయమని, ఇది దేశ ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని వ్యాఖ్యానించారు.

దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలతో పాటు ఓటు హక్కు కోల్పోయిన పౌరులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నా కేంద్ర ప్రభుత్వానికి చలనం లేకపోవడం దారుణమని రామకృష్ణ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు బాధ్యతారాహిత్యంగా జ్ఞానేశ్ కుమార్‌‌ను సమర్థిస్తున్నారని మండిపడ్డారు.