- ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. బుధవారం ఆదిలాబాద్, ఉట్నూర్ పోలీస్ సబ్‌డివిజన్ల పరిధిలో తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 90 మందిని పరీక్షించగా, డ్రగ్ టెస్టింగ్ కిట్లు, యూరిన్ పరీక్షల ద్వారా 57 మంది గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయింది.
వీరిలో పలువురిని డీ-అడిక్షన్ కేంద్రాలకు రిఫర్ చేశారు. గత ఏడాది కాలంలో జిల్లాలో 221 మందిపై గంజాయి కేసులు నమోదు చేసి, రూ.1.68 కోట్ల విలువైన 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 119 మందిని డీ-అడిక్షన్ కేంద్రాలకు పంపించారు. అలాగే జిల్లాలోని పొలాల్లో అక్రమంగా సాగు చేస్తున్న 1,632 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ సాగుకు పాల్పడిన వంద మందికి పైగా రైతులపై కేసులు నమోదు చేశారు. సుమారు 250 ఎకరాలకు రైతు భరోసా నిధులు నిలిపివేయడంతో పాటు, వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు పోలీసులు
వెల్లడించారు.
