కోర్టు కేసులున్న టీచర్ల సర్వీస్ రెగ్యుల రైజేషన్ ఆపండి : నవీన్ నికోలస్

కోర్టు కేసులున్న టీచర్ల సర్వీస్ రెగ్యుల రైజేషన్ ఆపండి : నవీన్ నికోలస్
  •  మిగతా వారికి ప్రొబేషన్ ఉత్తర్వులు వేగంగా జారీ చేయాలె 
  • డీఈఓలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ-2024 ద్వారా ఎంపికై, కోర్టు కేసుల పరిధిలో ఉన్న టీచర్ల సర్వీస్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఆదేశించింది. కేసులు పరిష్కారమయ్యే వరకు వారి సర్వీసును క్రమబద్ధీకరించవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు డైరెక్టర్ ఈ. నవీన్ నికోలస్ డీఈఓలకు ఉత్తర్వులు జారీ చేశారు.

డీఎస్సీ-2024 ద్వారా నియమితులైన టీచర్లలో కోర్టు కేసులతో సంబంధం ఉన్నవారిని గుర్తించి, వారి వివరాలను వెంటనే పంపించాలని డీఈఓలను ఆదేశించారు. కోర్టు తుది తీర్పు వచ్చే వరకు సంబంధిత టీచర్ల సర్వీస్ రెగ్యులరైజేషన్ ఫైళ్లను పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉంచాలని సూచించారు. ఈ ఉత్తర్వులను పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు. మరోవైపు, ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేని మిగతా టీచర్ల ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

డీఎస్సీ-2024 బ్యాచ్ టీచర్లు 2026 అక్టోబర్ 10 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. వీరికి 2025 అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో ఫస్టియర్ ఇంక్రిమెంట్ మంజూరు కాగా, 2026 అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో రెండో ఇంక్రిమెంట్ రావాల్సి ఉంది. అయితే ప్రొబేషన్ ఖరారు ఉత్తర్వులు ఉంటేనే రెండో ఇంక్రిమెంట్ మంజూరు చేస్తామని సబ్ ట్రెజరీ అధికారులు స్పష్టం చేయడంతో సమస్య ఏర్పడింది. టీచర్లు ఆర్థికంగా నష్టపోకుండా అర్హులైన వారి సర్వీస్ రికార్డులను వెంటనే పరిశీలించి, నిబంధనల ప్రకారం ప్రొబేషన్ డిక్లరేషన్ ఉత్తర్వులు జారీ చేయాలని నవీన్ నికోలస్ ఆదేశించారు.