వీబీ జీ రామ్ జీ అమలులో తెలంగాణ భేష్‌‌‌‌‌‌‌‌

వీబీ జీ రామ్ జీ అమలులో తెలంగాణ భేష్‌‌‌‌‌‌‌‌
  •  రేవంత్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి శివరాజ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ ప్రశంసలు
  • రాష్ట్రానికి 3,825 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి సీతక్కకు రాసిన లేఖలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో 'వీబీజీ రామ్ జీ (గ్రామీణ ఉపాధి హామీ)' పథకం అమలులో తెలంగాణ ప్రభుత్వం కనబరుస్తున్న చొరవ, కార్యాచరణ ప్రశంసనీయమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొనియాడారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో పనులను విజయవంతంగా ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు ప్రత్యేకంగా లేఖ రాశారు.

పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన పలు సూచనలకు కేంద్రం ఆమోదం తెలపడమే కాకుండా.. 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణకు రూ.3,825.3 కోట్ల నిధులను కేటాయించినట్లు తెలిపారు. సకాలంలో నిధుల విడుదల చేయడం ద్వారా పేద కూలీలకు వేతనాల చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, ఇప్పటివరకు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1.83 కోట్ల పనిదినాలు కల్పించడం అభినందనీయమని శివరాజ్ సింగ్ పేర్కొన్నారు.

అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తుల మేరకు పథకం పరిధిలోకి అనుమతించదగిన పనుల సంఖ్యను 375కు విస్తరించిన కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గృహ నిర్మాణ పథకాన్ని సైతం ఉపాధి హామీలో చేర్చుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రి సీతక్క నేతృత్వంలోని యంత్రాంగం చేస్తున్న కృషి ఫలితంగానే గ్రామీణ పేదలకు ఉపాధితో పాటు సొంతింటి కల నెరవేరేందుకు మార్గం సుగమమైందని, రాబోయే రోజుల్లోనూ తెలంగాణ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు.