గిరిజన విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు ..విద్యా ప్రమాణాలు, విద్యార్థుల సంక్షేమంపై సమీక్ష:మంత్రి మంత్రి సీతక్క

గిరిజన విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు ..విద్యా ప్రమాణాలు, విద్యార్థుల సంక్షేమంపై సమీక్ష:మంత్రి మంత్రి సీతక్క

ఏటూరునాగారం, వెలుగు: రాష్ట్రంలో గిరిజన విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, గిరిజన విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సీతక్క ఐటీడీఏ ఆఫీసర్లకు సూచించారు. 

గురువారం ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలు, విద్యార్థుల సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో పాల్గొన్నారు. 

గిరిజన విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని, విద్యాసంస్థల్లో మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని మంత్రి సూచించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 1800-425-3369 టోల్‌‌‌‌ఫ్రీ, 94933 68361 వాట్సాప్ సేవలను ప్రారంభించి, పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఐటీడీఏ ఆధ్వర్యంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌‌‌‌ను సందర్శించి, ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అందిస్తున్న ఉచిత శిక్షణతో పాటు స్కిల్ డెవలప్‌‌‌‌మెంట్ కోర్సులను పరిశీలించారు. 

జిల్లాకు మరిన్ని ఉద్యోగ పోస్టులు కేటాయించేలా సీఎంతో చర్చించామని, యువతకు శిక్షణ అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌‌‌‌పర్సన్ రేగా కల్యాణి, వివిధ శాఖల అధికారులు, ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ సంక్షేమ అధికారులు, ఐటీడీఏ సిబ్బంది పాల్గొన్నారు.