శాశ్వత అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి..మురసు తుపానుకు దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ వ్యవస్థను వెంటనే పునరుద్ధరించాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

శాశ్వత అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి..మురసు తుపానుకు దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ వ్యవస్థను వెంటనే పునరుద్ధరించాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: వీబీ-జీ రామ్ జీ పథకం ద్వారా తాత్కాలిక పనులకు బదులుగా ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం ఐడీవోసీ ఆఫీస్​లో కలెక్టర్ అంకిత్‌‌‌‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెరువుల పూడికతీత, కాలువల అభివృద్ధి, గ్రామీణ రోడ్లు, కల్వర్టులు, స్కూళ్లు, అంగన్‌‌‌‌వాడీ భవనాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మురసు తుపానుతో దెబ్బతిన్న పంటలు, రోడ్లు, విద్యుత్ వ్యవస్థను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. 

జిల్లాలో గుర్తించిన 56 ప్రాంతాల్లో మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని, విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి భూ సమస్యల పరిష్కారానికి సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వద్ద 36 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నందున ఇసుక బస్తాలతో చేపట్టిన రక్షణ చర్యలు కొనసాగించాలన్నారు. 
 
తెలంగాణ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటాం

హైదరాబాద్, వెలుగు: దేశీయ ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు క్రూడ్ పామాయిల్ దిగుమతులపై సుంకాన్ని తిరిగి 44 శాతానికి పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హామీ ఇచ్చారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు లేఖ రాశారు. 

దేశీయంగా వంట నూనెల అవసరాల్లో దాదాపు 56 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయని, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ధరలు, సరఫరా, వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దిగుమతి సుంకాలను రేషనలైజేషన్​చేయనున్నట్లు ప్రహ్లాద్ జోషి తన లేఖలో పేర్కొన్నారు.

 రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన ఆందోళనలను పరిగణలోకి తీసుకుని దిగుమతి సుంకాలను సమీక్షిస్తామన్నారు. అయితే, దేశీయ రైతుల సంక్షేమం కోసం దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పునరుద్ధరించాలన్న డిమాండ్‌‌కు కట్టుబడి ఉన్నామని తుమ్మల స్పష్టం చేశారు.