- ములుగు కేంద్రంగా సెంటర్ ఫర్ ట్రైబల్ హెల్త్ అండ్ అకడమిక్ ఎక్సలెన్స్
- ఎయిమ్స్ బీబీనగర్, ట్రైబల్ వర్సిటీ, ఐటీడీఏల ఉమ్మడి హెల్త్ యాక్షన్ ప్లాన్
- హబ్ అండ్ స్పోక్ మోడల్లో అటవీ ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ సేవలు
- టీబీ గుర్తింపునకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొబైల్ ఎక్స్రే బస్సు
- యువతకు శిక్షణనిచ్చి ఆరోగ్య అనుసంధానకర్తలుగా తీర్చిదిద్దనున్న ఎయిమ్స్
హైదరాబాద్, వెలుగు: మౌలిక వైద్య సదుపాయాలకు ఆమడ దూరంలో ఉండే మారుమూల అటవీ గూడేలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేసేందుకు ఎయిమ్స్ బీబీనగర్ సమగ్ర ప్రణాళిక రూపొందించింది. ములుగులోని సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ (ఎస్ఎస్సీటీయూ), ఏటూరునాగారం ఐటీడీఏ భాగస్వామ్యంతో సెంటర్ ఫర్ ట్రైబల్ హెల్త్ అండ్ అకడమిక్ ఎక్సలెన్స్ ఏర్పాటు, ప్రత్యేక రీసెర్చ్ బ్లాక్ నిర్మాణానికి ప్రతిపాదించింది.
జిల్లాలోని 9 మండలాల్లో ఉన్న 86,352 మంది గిరిజనుల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా హబ్ అండ్ స్పోక్ నెట్వర్క్ను అమలు చేయనున్నారు. ఇందులో ఎయిమ్స్ ప్రధాన కేంద్రంగా ఉంటూ సూపర్ స్పెషాలిటీ వైద్యం అందిస్తుంది. ట్రైబల్ వర్సిటీ, ఐటీడీఏల సహకారంతో మారుమూల గ్రామాలకు సేవలను విస్తరిస్తారు. ములుగు, ఏటూరునాగారంలో శాటిలైట్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు.
‘ఈ-సంజీవని’ ద్వారా 5 స్పెషలిస్ట్ డిపార్ట్మెంట్ల టెలీ కన్సల్టేషన్లు అందించడంతో పాటు, మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా గ్రామాల్లోనే ప్రాథమిక పరీక్షలు, చికిత్సలు అందిస్తారు. ములుగులో వచ్చే ఫలితాల ఆధారంగా ఇతర గిరిజన ప్రాంతాలకూ ఈ ప్రాజెక్టును విస్తరించనున్నారు.
నాలుగు తరాలపై స్టడీ...
గిరిజన ప్రాంతాల్లో సంక్రమణ, దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు ఎయిమ్స్ పలు రీసెర్చ్ ప్రాజెక్టులు చేపట్టనుంది. మిషన్ స్వాస్థ్య సేతు కింద ఇంటర్నెట్ లేని అటవీ పల్లెల్లోనూ 60 సెకన్లలో క్షయను గుర్తించే ఆఫ్లైన్ ఏఐ పోర్టబుల్ డిజిటల్ ఎక్స్రే బస్సును వినియోగించనున్నారు. డ్రగ్ రెసిస్టెంట్ టీబీని త్వరగా నిర్ధారించేందుకు అధునాతన సీ అండ్ డీఎస్టీ లిక్విడ్ కల్చర్ ల్యాబ్ టెస్టులు నిర్వహిస్తారు. నిక్షయ్ పోర్టల్ సమన్వయంతో పౌష్టికాహార కిట్ల పంపిణీని పర్యవేక్షిస్తారు.
2019-–2026 రికార్డుల ఆధారంగా మలేరియా, డెంగ్యూ వ్యాప్తిపై డిజిటల్ జీఐఎస్ హాట్స్పాట్ మ్యాపింగ్ చేస్తారు. జంతువులు, పర్యావరణం నుంచి మనుషులకు సంక్రమించే స్క్రబ్ టైఫస్, లెప్టోస్పైరోసిస్ వంటి వ్యాధులను ముందే గుర్తించేందుకు వన్ హెల్త్ క్షేత్ర నిఘా, రెఫరల్ డయాగ్నోస్టిక్ స్టడీ నిర్వహిస్తారు. కోయ, గోండు మహిళలు ఎదుర్కొన్న సామాజిక అశాంతి, నిర్వాసిత ఒత్తిడి వారి జన్యువులపై చూపిన ప్రభావాన్ని విశ్లేషించేందుకు ‘నాలుగు తరాల మాతృవంశ ఎపిజెనెటిక్ స్టడీ’ చేపట్టనున్నారు.
గిరిజన యువతకు ట్రైనింగ్...
వైద్య సేవల విస్తరణకు భాష, సంస్కృతి అడ్డంకి కాకుండా ‘సంవాద్ ములుగు’ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. కోయ, గోండి, లంబాడీ భాషల్లో ఆరోగ్య సమాచారాన్ని ప్రచారం చేస్తారు. అకడమిక్ ఎక్సలెన్స్ సెంటర్ ద్వారా ఏటా 140 మందికి పైగా గిరిజన యువతకు నర్సింగ్, పారామెడికల్, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల ద్వారా శిక్షణ ఇస్తారు.
వారిని సొంత ప్రాంతాల్లో ఆరోగ్య అనుసంధానకర్తలుగా తీర్చిదిద్దుతారు. వీరి భాగస్వామ్యంతో గ్రామాలు, వారపు సంతలు, మేడారం జాతరలో ముందస్తు స్క్రీనింగ్ నిర్వహిస్తారు. మాతా-శిశు సంరక్షణ, రక్తహీనత, సికిల్ సెల్ వ్యాధి, పోషకాహార లోపాలను క్షేత్రస్థాయిలోనే అరికట్టేందుకు ఆరోగ్య ప్రచార కార్యక్రమాలు చేపడతారు.
