కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికులకు దీపావళి కానుకగా ప్రభుత్వం పర్ఫార్మెన్స్ లింక్డ్ పేమెంట్ (పీఎల్‌ఆర్) బోనస్‌ను అందించింది. గురువారం సింగరేణిలో పనిచేస్తున్న 38 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250 చొప్పున మొత్తం రూ.419 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.
అక్టోబర్ మొదటి వారంలో జరిగిన జేబీసీసీఐ అపెక్స్ మీటింగ్‌లో బోనస్ చెల్లింపుపై నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2025– -26 ఆర్థిక సంవత్సరంలో సంస్థ పనితీరును పరిగణనలోకి తీసుకుని పీఎల్‌ఆర్ బోనస్‌ను ఖరారు చేశారు.
కోల్ ఇండియా ఉద్యోగులకు దసరాకు ముందే బోనస్ చెల్లించగా, సింగరేణి కార్మికులకు దీపావళికి ముందు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో అండర్‌గ్రౌండ్ గనుల్లో కనీసం 190 రోజులు, ఓపెన్‌కాస్ట్ గనుల్లో కనీసం 240 రోజులు పనిచేసిన కార్మికులకు పూర్తి బోనస్ లభించింది. అంతకంటే తక్కువ రోజులు పనిచేసిన వారికి పనిదినాల నిష్పత్తి ప్రకారం చెల్లింపులు చేశారు. గత నెల 30న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నవంబర్ 5న దీపావళి బోనస్ చెల్లిస్తామని ప్రకటించారు. మరోవైపు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి ఆర్జించిన రూ.1,754 కోట్ల నికర లాభాల్లో 34 శాతం వాటాను ప్రభుత్వం కార్మికులకు ప్రకటించింది.
ఇందులో భాగంగా గత నెల 16న 38,737 మంది కార్మికులకు ఒక్కొక్కరికి సగటున రూ.1,53,912 చొప్పున మొత్తం రూ.596.20 కోట్లను లాభాల వాటాగా అందించింది. అలాగే 29,717 మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5,500 చొప్పున మొత్తం రూ.16.34 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసింది. దీపావళి బోనస్ నగదును గురువారం సింగరేణిలో పనిచేస్తున్న పర్మినెంట్ కార్మికులందరి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు సంబంధిత ఆఫీసర్లు వెల్లడించారు.
