- ప్రాథమిక దశలోనే ప్రత్యేక అవసరాలున్న పిల్లల గుర్తింపు
- రాష్ట్రవ్యాప్తంగా 12.64 లక్షల మంది విద్యార్థులకు తొలిదశ స్క్రీనింగ్ పూర్తి
మెదక్, వెలుగు : విద్యార్థుల్లోని వైకల్యాలను ప్రాథమిక దశలోనే గుర్తించి, అవసరమైన సహాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు (సీడబ్ల్యూఎస్ఎన్) కార్యక్రమాన్ని చేపట్టింది. చిన్నారుల్లో శారీరక, మానసిక సమస్యలను సకాలంలో గుర్తించకపోవడం వల్ల వయసు పెరిగే కొద్దీ ఇబ్బందులు తీవ్రమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను పాఠశాల స్థాయిలోనే గుర్తించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్‌సీఈఆర్‌టీ ‘ప్రశస్త్ 2.0’ పేరుతో ప్రత్యేక డిజిటల్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని రూపొందించింది.
ఆటిజం నుంచి వినికిడి సమస్యల వరకు..
పిల్లల్లో ఆటిజం, వినికిడి, దృష్టి, మాట, శారీరక, మేధోపరమైన సమస్యలను గుర్తించడం ప్రశస్త్ 2.0 ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో 3 నుంచి 18 ఏండ్ల మధ్య వయసున్న విద్యార్థులకు స్ర్కీనింగ్నిర్వహిస్తున్నారు. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియను కొనసాగుతోంది. రెండు దశల్లో విద్యార్థులను పరిశీలించనున్నారు.
మొదటి దశ స్క్రీనింగ్ లో స్కూల్ లో పనిచేసే రెగ్యులర్ టీచర్లు విద్యార్థులందరికీ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. వారిలో కనిపించే వైకల్య లక్షణాలను గుర్తించి నమోదు చేస్తారు. రెండో దశ స్క్రీనింగ్ స్పెషల్ ఎడ్యుకేటర్లు నిర్వహిస్తారు. మొదటి దశలో గుర్తించిన విద్యార్థులను మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అవసరమైన వారిని తదుపరి వైద్య పరీక్షలకు సిఫార్సు చేస్తారు. రెండు దశల్లో స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత గుర్తించిన విద్యార్థులకు అవసరమైన వైద్య పరీక్షలు, సదరం సర్టిఫికెట్లు, అవసరమైన పరికరాలు, స్కాలర్ షిప్, ప్రత్యేక విద్యా సేవలు అందేలా విద్యాశాఖ ఆఫీసర్లు చర్యలు తీసుకుంటారు.
టీచర్లకు ట్రైనింగ్..
ప్రశస్త్ 2.0 అమలుపై టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చారు. విద్యార్థుల్లో శారీరక, మానసిక వైకల్య లక్షణాలను ఎలా గుర్తించాలనే అంశంపై వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రశస్త్ 2.0 పోర్టల్లో తమ పాఠశాలలను నమోదు చేసి, టీచర్లకు లాగిన్ కేటాయించారు.
హెచ్ఎంల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో మొత్తం 42,283 స్కూల్స్ ఉండగా, వాటిల్లో మొత్తం 75,75,653 మంది విద్యార్థులు ఉన్నారు. ఆయా స్కూళ్లలో 3,58,041 మంది టీచర్లు ఉండగా, వారి ఆధ్వర్యంలో బుధవారం వరకు 12,64,709 మంది విద్యార్థులకు మొదటి దశ స్క్రీనింగ్ పూర్తయింది.
