ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరదలు..రెస్క్యూ కోసం వెళ్లిన 11 మంది గల్లంతు

 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరదలు..రెస్క్యూ కోసం వెళ్లిన 11 మంది గల్లంతు
  • బేతుపల్లి చెరువులో చిక్కుకున్న ఐదుగురు మత్స్యకారులు
  • రెస్క్యూ కోసం వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ టీమ్స్​ బోట్లు బోల్తా 
  • సురక్షితంగా ఉన్నామంటూ నలుగురి ఫోన్
  • ఏడుగురి ఆచూకీ కోసం రంగంలోకి  ఎన్డీఆర్ఎఫ్​ 
  • అర్ధరాత్రి దాటాకా  ముమ్మరంగా గాలింపు చర్యలు 
  • పరిస్థితిపై సీఎం రేవంత్, కేంద్ర మంత్రి బండి ఆరా

ఖమ్మం/ సత్తుపల్లి, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాను మురసు తుపాను ముంచెత్తింది. సత్తుపల్లి మండలం బేతుపల్లిలో  జాలర్లను కాపాడేందుకు వెళ్లి 11 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది గల్లంతయ్యారు.   భారీ వర్షాలకు బేతుపల్లి పెద్ద చెరువు అలుగు పారుతుండడంతో చేపలు బయటకు వెళ్లకుండా వలలు ఏర్పాటు చేసేందుకు ఐదుగురు జాలర్లు వెళ్లి వరదలో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు తొలుత ముగ్గురు ఫైర్‌ సిబ్బంది బోటులో వెళ్లగా అది మొరాయించడంతో చిక్కుకుపోయారు. దీంతో కొత్తగూడెం ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన ఆరుగురు, మరో నలుగురు ఫైర్‌ సిబ్బంది, ఇద్దరు గైడ్‌లు రెండు బోట్లలో వారిని కాపాడేందుకు వెళ్లారు. 

తొలుత బోటులో చిక్కుకుపోయిన ముగ్గురు అగ్నిమాపక సిబ్బందిని వెనక్కి తీసుకొచ్చారు. అనంతరం మత్సకారులను తీసుకొచ్చేందుకు వెళ్లగా రెండు బోట్లు పల్టీలు కొట్టి అందులోని 11 మంది గల్లంతయ్యారు. వారిలో నలుగురు అధికారులకు ఫోన్లు చేసి తాము ఒక చెట్టుపై సురక్షితంగా ఉన్నామని తెలిపారు. మిగతా ఏడుగురి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపుచర్యలు  చేపట్టాయి. చెట్లపై చిక్కుకున్న వారిని ఒడ్డుకు చేర్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్‌ దివాకర్ టీఎస్‌, ఎమ్మెల్యే మట్టా రాగమయి సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

48 గంటల్లో 47 సెంటీమీటర్లకు వాన

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మురసు తుఫాను బీభత్సం సృష్టించింది. ఏపీని ఆనుకొని ఉన్న అశ్వారావుపేట నియోజకవర్గంలో 48 గంటల్లో 47 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మంగళవారం 20 సెంటీమీటర్లు, బుధవారం రాత్రి వరకు 27 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సత్తుపల్లి నియోజకవర్గంలో 20 సెంమీటర్ల వర్షం పడింది. దీంతో ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు, తల్లాడ మండలాల్లో పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.

చెరువులు అలుగుపోస్తున్నాయి. చాలా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రభావంతో అశ్వారావుపేటలో ఏపీని ఆనుకొని గుమ్మడివల్లి దగ్గర ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు రింగ్ బండ్​ కు గండి పడింది.రెండేండ్ల కింద ఈ ప్రాజెక్టు ఆనకట్టకు గండిపడగా, తాత్కాలిక ప్రాతిపదికన రింగ్ బండ్​ నిర్మించారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో ఉండగా ఆయకట్టు మొత్తం ఏపీలోని వేలేరుపాడు మండలంలో ఉంటుంది.

ఇప్పుడు రింగ్ బండ్​ కు గండిపడడంతో వేలేరుపాడు మండలంలో మూడు గ్రామాలను వరదనీరు ముంచెత్తింది. అశ్వారావుపేటలో ప్రధాన రహదారితో పాటు పలు కాలనీల్లో ఇండ్లలోకి వరద నీరు చేరుకోవడంతో స్థానికులు ఎత్తయిన బిల్డింగులను ఎక్కి తలదాచుకున్నారు. దొంతికుంట చెరువు ప్రభావంతో వరద వచ్చిందని భావించిన మున్సిపల్ కమిషనర్​దిలీప్​రెడ్డి, చెరువుకు గండి కొట్టి వరద నీటిని బయటకు పంపడంతో ముంపు ప్రభావం తగ్గింది.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన ఐదుగురు మత్స్యకారులు వరద ఉధృతిలో చిక్కుకుపోయారు.  కాకర్లపల్లి రామానగరం గ్రామానికి చెందిన మత్స్యకారులను రక్షించేందుకు పోలీసులు, రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.  దీంతో బేతుపల్లి చెరువు వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అశ్వారావుపేట, భద్రాచలం రోడ్డులో వరద ప్రవాహానికి ఆటో కొట్టుకుపోగా,  ప్రయాణికులను ఎన్డీఆర్ఎఫ్​ సిబ్బంది కాపాడారు. 

పంటలకు తీవ్రనష్టం..

ఉమ్మడి జిల్లాలో వరి, పత్తి, మిర్చి రైతులు ఈ తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన వరి పొలాలు ఈదురుగాలుల కారణంగా నేలవాలగా, పత్తి, మిర్చితోటలు, వేరు శనగ పంట నీట మునిగాయి. ఇక వరి పొలాల్లోనే వడ్లు రాలుతున్నాయని, ధాన్యానికి మంచి రేటుందనుకుని సంబరపడుతున్న సమయంలో ఈ వరద, వర్షాలు వచ్చి ముంచాయని బాధపడుతున్నారు.

దమ్మపేట మండలం పట్వారి గూడెం జడ్పీ హై స్కూల్ ప్రహరీ  వర్షానికి కుప్పకూలింది. ముందుగానే మండలంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో పెను ప్రభావం తప్పింది. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఎంఈఓలు ముందస్తుగానే బుధవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బేతుపల్లి చెరువులో ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్ల గల్లంతుపైసీఎం  రేవంత్ ఆరా తీశారు.  పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్​కు సూచించారు. మరోవైపు ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని  సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్​రంగంలోకి దించామని కేంద్రమంత్రి బండి సంజయ్​ తెలిపారు.