- స్కానర్లలో వేయగానే ఆటోమేటిక్‌గా కౌంట్
వాషింగ్టన్ డీసీ: ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికాలో బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరుగుతోంది. ఫలితాలు ఆలస్యమవుతాయని అనుకుంటే గంటల వ్యవధిలో వెలువడుతున్నాయి. అమెరికాలో 10 కోట్లకు పైగా బ్యాలెట్లు పోలైనట్లు అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) అంచనా వేసింది. బుధవారం తెల్లవారేసరికే కాంగ్రెస్ ఉభయ సభలు ఎవరి వశమయ్యాయో తేలిపోయింది.
మన దగ్గర మాత్రం గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ల లెక్కింపు రోజుల తరబడి సాగుతుంది. ఇటీవల బిహార్ శాసనమండలి ఎన్నికల్లో ఓ నియోజకవర్గంలో కేవలం 69,141 ఓట్లను లెక్కించడానికే 57 గంటలు పట్టిందని రిపోర్టులు చెబుతున్నాయి.
ఓటు కాగితంపై.. లెక్క మెషీన్‌తో..
అమెరికా విధానంలో అసలు కీలకం ఇదే. ఓటర్లు బ్యాలెట్ పేపర్‌పై తమకు నచ్చిన అభ్యర్థి పేరు పక్కన ఉన్న గుండ్రటి గుర్తును లేదా బాక్సును నింపుతారు. ఆ బ్యాలెట్‌ను పోలింగ్ కేంద్రంలోనే లేదా కౌంటింగ్ సెంటర్లో స్కానర్‌లో వేస్తారు. స్కానర్ ఆ గుర్తును చదివి, ఓటును ఆటోమేటిక్‌గా అభ్యర్థి ఖాతాలో కలిపేస్తుంది. పెద్ద కౌంటింగ్ కేంద్రాల్లోని హైస్పీడ్ మెషీన్లు గంటకు వేల బ్యాలెట్లను ప్రాసెస్ చేస్తాయి.
అమెరికాలో దాదాపు అన్ని ఎన్నికల పరిధుల్లోనూ కాగితపు బ్యాలెట్ లేదా పేపర్ రికార్డు ఉండే పరికరాలనే వాడుతున్నారని అక్కడి ఎన్నికల సహాయ కమిషన్ 2024 సర్వే చెబుతోంది. అసలు బ్యాలెట్లను భద్రపరుస్తారు.. దీంతో రీకౌంటింగ్, వివాదం వచ్చినప్పుడు చెక్ చేయొచ్చు.
సగం పని పోలింగ్‌కు ముందే..
అమెరికాలో చాలామంది పోలింగ్ రోజు కంటే ముందే ఓటేస్తారు. ఈసారి పోలింగ్ నాటికే 5.7 కోట్ల మందికి పైగా ముందస్తు ఓటు వేశారని ఫ్లోరిడా వర్సిటీ ఎలక్షన్ ల్యాబ్ తెలిపింది. 43 రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్లను పోలింగ్ రోజుకు ముందే సిద్ధం చేసుకునేందుకు అనుమతి ఉంది. ఓటరు వివరాలు, సంతకాలు సరిచూసి, కవర్లు తెరిచి, బ్యాలెట్లను స్కానింగ్‌కు రెడీ చేసి ఉంచుతారు.
ఒకే చోట కాదు.. వేల చోట్ల..
అమెరికాలో దేశమంతటికీ ఒకే కౌంటింగ్ కేంద్రం ఉండదు. కౌంటీలు, నగరాలు, పట్టణాల వారీగా 10 వేలకు పైగా స్థానిక పరిధుల్లో ఎన్నికలు జరుగుతాయి. వేలాది కౌంటింగ్ బృందాలు ఒకేసారి మెషీన్లతో లెక్కిస్తాయి. ఒక్కో బ్యాచ్ లెక్క పూర్తికాగానే ఆ అంకెలు స్థానిక మొత్తానికి, ఆ తర్వాత ఫలితాలు క్రోడీకరించే అధికారులకు చేరుతాయి. 1848 నుంచి అమెరికా ఎన్నికల ఫలితాలను రిపోర్ట్ చేస్తున్న ఏపీ వార్తా సంస్థ, దేశవ్యాప్తంగా 4 వేల మందికి పైగా రిపోర్టర్లతో ఎన్నికల ఆఫీసుల నుంచి అంకెలు సేకరిస్తుంది.
లెక్క పూర్తికాకముందే విజేత !
అమెరికాలో అన్ని ఓట్లూ లెక్కించకముందే వార్తా సంస్థలు విజేతను ప్రకటిస్తాయి. ఇప్పటివరకు లెక్కించిన ఓట్లు, ఇంకా మిగిలిన బ్యాలెట్లు, అవి ఏ ప్రాంతాలవి అనేది విశ్లేషించి ఈ అంచనా (ప్రొజెక్షన్) ఇస్తాయి. దీంతో లెక్క పూర్తికాకుండానే విజేతను ప్రకటిస్తారు. అయితే ఇవి అధికారిక ఫలితాలు కావు. అధికారులు లెక్కింపు పూర్తి చేసి, సరిచూసి, అధికారికంగా ధ్రువీకరించడానికి రోజులు, కొన్నిసార్లు వారాలు పడుతుంది.
మన ఎమ్మెల్సీ లెక్కింపు ఎందుకు ఆలస్యం?
మన దగ్గర లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఈవీఎంలు వాడుతుండగా, గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం బ్యాలెట్ పేపర్లతోనే జరుగుతాయి. ఇందుకు ప్రధాన కారణం ప్రాధాన్యత ఓటింగ్ విధానం. ఓటరు ఒక్క అభ్యర్థికి కాకుండా, అభ్యర్థులందరికీ 1, 2, 3.. ఇలా ప్రాధాన్యత క్రమంలో అంకెలు వేస్తారు. లెక్కింపులో మొదట తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు.
ఎవరికీ గెలుపు కోటా రాకపోతే, అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని తొలగించి, ఆయన బ్యాలెట్లలోని రెండో ప్రాధాన్యత ఓట్లను మిగతావారికి పంచుతారు. ఎవరో ఒకరు కోటా దాటేదాకా ఈ ఎలిమినేషన్ రౌండ్లు కొనసాగుతాయి. ఇదంతా చేతులతోనే జరుగుతుంది, ప్రతి బ్యాలెట్‌ను సిబ్బంది కళ్లతో చూసి చదవాల్సిందే. చెల్లని ఓట్లపై అభ్యర్థుల ఏజెంట్ల అభ్యంతరాలూ ఆలస్యానికి కారణమవుతాయి.
