ఇరాన్ యుద్ధమే కారణం: మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ల ఓటమిపై జేడీ వాన్స్ వ్యాఖ్యలు

ఇరాన్ యుద్ధమే కారణం: మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ల ఓటమిపై జేడీ వాన్స్ వ్యాఖ్యలు

 అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమికి ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధమే ప్రధాన కారణమని వైస్ ప్రసిడెంట్  జేడీ వాన్స్ పేర్కొన్నారు. 2024లో ట్రంప్-వాన్స్‌కు ఓటు వేసిన చాలామంది ఓటర్లు ఈసారి డెమొక్రాట్ల వైపు మారిపోయారని ఆయన X లో పోస్ట్ చేశారు. 2026 నవంబర్ 4న వెలువడిన మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత వాన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

డెమొక్రాట్లు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్ రెండింటిలోనూ ఘన విజయం సాధించారు. దీనిపై స్పందిస్తూ వాన్స్.. మా ఓటమికి ప్రధాన కారణం యుద్ధం..  అని అన్నారు.  రిపబ్లికన్ ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్నారు కానీ, చాలామంది పార్టీకి ఓటు వేయకుండా డెమొక్రాట్లకు మద్దతు ఇచ్చారని ఆరోపించారు.

 సర్వేలు, పోల్‌స్టర్ల అభిప్రాయాల ఆధారంగా ఓటమికి  వాన్స్ నాలుగు ప్రధాన కారణాలు పేర్కొన్నారు. ఇరాన్‌తో యుద్ధం, పెరుగుతున్న జీవన ఖర్చులు, ద్రవ్యోల్బణం, అమెరికా ఫస్ట్ అజెండాపై ప్రభుత్వ నిబద్ధతపై అనుమానాలు, ఇజ్రాయెల్‌తో వాషింగ్టన్ సంబంధాలపై అసంతృప్తి. ఈ కారణాలే తమ ఓటమికి కారణమని అన్నారు. 

2024లో ట్రంప్, వాన్స్‌కు ఓటు వేసిన చాలామంది 2026లో డెమొక్రాట్లకు ఓటు వేశారు. ఇదే మా ప్రధాన సమస్య అని వాన్స్ అన్నారు. ఫ్లోరిడా ఉదాహరణగా చూపుతూ, అక్కడ రిపబ్లికన్ ఓటర్లు ఎక్కువగా ఉన్నా కూడా పార్టీకి మద్దతు తగ్గిందని అన్నారు. 

అయితే ఓటమిపై ట్రంప్ కూడా అంతకుముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలను తనకు ఎదురు దెబ్బగా చూడటం లేదని చెప్పారు.  యుద్ధం కూడా ఓటమికి దోహదం చేసిందని అంగీకరిస్తూనే, అభ్యర్థులు ఓటర్లను ప్రేరేపించలేకపోయారని, తాను బ్యాలెట్‌లో లేకపోవడమే అసలు కారణమని అన్నారు.