అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు ట్రంప్ పై ఇండియన్ అమెరికన్ల ఆగ్రహానికి అద్దంపడుతున్నాయా? అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్ల విజయాలకు కారణం ఇదేనా? ట్రంప్ పార్టీలోని కీలక వ్యక్తుల ఓటమీ, కీలక రాష్ట్రాలు రిపబ్లికన్ల చేజారడం వెనక అసలు కారణం ఇదేనా.. అంటే ఫలితాలు అదే చెబుతున్నాయి. ట్రంప్, ఆయన రిపబ్లికన్ పార్టీపై ఇండియన్ అమెరికన్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఈ ఎన్నికల ద్వారా డెమోక్రాట్ల వైపు మొగ్గు చూపారని రాజకీయ విశ్లేషకులు, ఎన్నికల డేటా స్పష్టం చేస్తోంది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో 30శాతం ఇండియన్ అమెరికన్లు ట్రంప్‌కు మద్దతు ఇచ్చినప్పటికీ తాజా మధ్యంతర ఎన్నికల నాటికి రిపబ్లికన్ కాంగ్రెస్ అభ్యర్థులకు భారతీయ సంతతి మద్దతు కేవలం 19శాతానికి పడిపోవడం వెనక ట్రంప్ నిర్ణయాలు, వలస విధానాలు, సుంకాలేనని విశ్లేషిస్తున్నారు.
అక్టోబర్ 2026 లో కార్నెగీ నిర్వహించిన సర్వే ప్రకారం.. 62శాతం నుంచి -66శాతం మంది ఇండియన్ అమెరికన్లు డెమోక్రాట్లకు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. ట్రంప్‌పై ఉన్న వ్యతిరేకత వల్లే తాము డెమోక్రాట్లకు ఓటు వేస్తున్నామని అందులో 35శాతం మంది ఓటర్లు బహిరంగంగానే వెల్లడించారు. 40 ఏళ్లు పైబడిన భారతీయ సంతతి మగవారిలో జనవరి 2026 లో రిపబ్లికన్లకు 32శాతం మద్దతు ఉండగా, అక్టోబర్ నాటికి అది 16శాతానికి పడిపోయింది. అదే సమయంలో డెమోక్రాట్లకు మద్దతు 53శాతం నుంచి 68శాతానికి పెరిగింది.
ట్రంప్ మద్దతుదారులకు గట్టి ఎదురుదెబ్బ
ఈ ఎన్నికల్లో ట్రంప్ స్వయంగా మద్దతు ప్రకటించిన రిపబ్లికన్ అభ్యర్థి, భారతీయ సంతతికి చెందిన వివేక్ రామస్వామి ఒహియో గవర్నర్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. డెమోక్రాట్ అభ్యర్థి అమీ ఆక్టన్ చేతిలో రామస్వామి ఓడిపోవడం ట్రంప్ శ్రేణులకు పెద్ద ఎదురు దెబ్బే. మరోవైపు డెమోక్రాట్ పార్టీ తరపున పోటీచేసిన భారతీయ సంతతి నేతలు సుహాస్ సుబ్రహ్మణ్యం, అరుణా మిల్లర్, పియా దండియా వంటి భారీ విజయాలు సాధించడం ట్రంప్ వర్గాల్లో కలవరం రేపుతోంది.
►ALSO READ | అమెరికా ఎన్నికలు : ట్రంప్ దెబ్బకు 30 ఏళ్లుగా ఉన్న పార్టీ కంచుకోటలు బద్దలు
ఇండియన్ అమెరికన్ల ఆగ్రహానికి కారణాలు ఇవేనా..
జాతి వివక్ష..
2025-నుంచి 26 మధ్యకాలంలో ట్రంప్ హయాంలో శ్వేతజాత్యహంకారం పెరిగిందని, భారతీయులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిందన్న అభిప్రాయం ఇండియన్ అమెరికన్లలో స్పష్టం కనిపిస్తోంది. ఏప్రిల్ 2026 లో ఓ పాడ్ కాస్ట్ షోలో భారత్, చైనాలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా ఇండియన్ అమెరికన్లలో తీవ్ర ఆగ్రహానికి గురి చేసినట్లు తెలుస్తోంది.
H-1B ,వీసా రూల్స్..
ట్రంప్ ప్రభుత్వం H-1B వీసాలపై కఠినమైన రూల్స్, లక్ష డాలర్ల అదనపు ఫీజులు, గ్రీన్ కార్డ్ జారీలో జాప్యం,ట్రంప్ విధించిన 'లిబరేషన్ డే' సుంకాలు, వాణిజ్య ఉద్రిక్తతలు ఇండియన్ -అమెరికన్ వ్యాపారాలపై, ముఖ్యంగా సప్లై చైన్, రీటైల్ రంగాలపై ప్రతికూల ప్రభావం చూపాయి.
డొనాల్డ్ ట్రంప్ విధానాలపై , ఆయన అనుచరుల వ్యాఖ్యలపై వ్యక్తమైన నిరసనను ఇండియన్ అమెరికన్లు తమ ఓటు హక్కు ద్వారా ఈ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా చూపించారనేది విశ్లేషకుల అభిప్రాయం.
