రాంగ్ నంబర్ డయల్ చేశారు.. మీరు కూడా నిరసన తెలుపొచ్చుగా: పిటిషనర్తో సుప్రీం కోర్టు సీజేఐ వ్యాఖ్యలు

రాంగ్ నంబర్ డయల్ చేశారు.. మీరు కూడా నిరసన తెలుపొచ్చుగా: పిటిషనర్తో సుప్రీం కోర్టు సీజేఐ వ్యాఖ్యలు

 షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST) రిజర్వ్డ్ నియోజకవర్గాలను రొటేషన్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు 2026 నవంబర్ 4 ( బుధవారం ) కొట్టివేసింది. ఈ విషయం పార్లమెంటు పరిధిలోకి వస్తుందని కోర్టు జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  మీరు రాంగ్ నంబర్ డయల్ చేశారు. ఇప్పుడు నిరసనలు, నినాదాలకు మంచి సీజన్ ఉంది. మీరు కూడా అలా చేయొచ్చు. కొంత ధైర్యం చేసి చట్టసభలు  చేయాల్సిన సమయం వచ్చిందని గట్టిగా చెప్పండి అంటూ వ్యాఖ్యానించారు. 

నియోజకవర్గాల రొటేషన్ పిటిషన్‌ను  చీఫ్ జస్టిస్ సూర్యకాంత్,  జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి ల  బెంచ్ విచారించింది. పిటిషనర్ వాదన ప్రకారం 1972 నుంచి కొన్ని నియోజకవర్గాలు నిరంతరం రిజర్వ్డ్‌గా ఉండటం వల్ల అదే కుటుంబాలు మళ్లీ మళ్లీ పోటీ చేస్తున్నాయి. దీనివల్ల ఓటర్ల ఎంపిక పరిమితమవుతోందని, ఓటు హక్కు బలహీనపడుతోందని వాదించారు. 2008లో డీలిమిటేషన్ కమిషన్ సూచించిన రొటేషన్ సిఫార్సులను అమలు చేయాలని కోరారు.

న్యాయమూర్తి బాగ్చి స్పందిస్తూ.. మేము పార్లమెంట్ కు మూడో సభగా వ్యవహరించలేమని  స్పష్టం చేశారు. రిజర్వేషన్ విషయం రాజ్యాంగ అధికారులు, శాసనసభల పరిధిలో ఉందని, కోర్టు రాజ్యాంగ నిబంధనలను మార్చి రొటేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టలేదని అన్నారు.  

డీలిమిటేషన్ యాక్ట్ సెక్షన్ 9(1)(c)ని సవాలు చేస్తూ వేసిన ఈ అప్పీల్‌ను కోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పుతో ఏకీభవిస్తూ, రొటేషన్ కావాలని అనిపించినా అది చట్టసభలు నిర్ణయించాల్సిన విషయమని పేర్కొంది. పిటిషనర్‌ను ప్రజా ప్రతినిధులను సంప్రదించి, డీలిమిటేషన్ కమిషన్ సూచనలను అమలు చేయించుకోవాలని సూచించింది.