హైదరాబాద్, వెలుగు: కృష్ణా బోర్డు మీటింగ్మరోసారి వాయిదా పడింది. ఏపీ విజ్ఞప్తి మేరకు గురువారం జరగాల్సిన 21వ బోర్డు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు బోర్డు రెండు రాష్ట్రాలకు బుధవారం లేఖ రాసింది. మురసు తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో అధికారులంతా ఆ పనుల్లోనే ఉన్నారని, వేరొక రోజు మీటింగ్ పెట్టాలని ఏపీ విజ్ఞప్తి చేసిందని లేఖలో బోర్డు పేర్కొంది.
కాగా, బోర్డు మీటింగ్ రికార్డు స్థాయిలో ఆరుసార్లు వాయిదా పడడం గమనార్హం. వాస్తవానికి ఈ ఏడాది మేలోనే 21వ బోర్డు సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, ఏపీ కేబినెట్ భేటీ ఉండడంతో హాజరు కాలేమని ఏపీ వాయిదా కోరింది. దీంతో ఆగస్టుకు మీటింగ్‌ను వాయిదా వేశారు. వివిధ కారణాలతో ఆ నెలలోనూ మీటింగ్జరగలేదు. అక్టోబర్1కి వాయిదా పడింది.
ఆ రోజు రాష్ట్రంలో కేబినెట్ మీటింగ్ ఉండడంతో వాయిదా వేయాలని తెలంగాణ కోరింది. దీంతో ఆ భేటీ కాస్తా అక్టోబర్26కి వాయిదా వేశారు. ఆ రోజు మహారాష్ట్ర సీఎంతో రేవంత్ రెడ్డి, ఇరిగేషన్అధికారుల మీటింగ్ ఉండడంతో తెలంగాణ వాయిదా వేయాలని కోరింది. దీంతో ఆ భేటీని 27కి వాయిదా వేశారు. వివిధ కారణాలతో ఆ రోజు కూడా మీటింగ్ జరగలేదు. మళ్లీ నవంబర్5కి వాయిదా వేశారు. కానీ, ఏపీలో మురసు తుఫాను ఎఫెక్ట్ కారణంగా ఆరోసారి మీటింగ్ వాయిదా పడింది. మళ్లీ మీటింగ్ ఎప్పుడు పెడతారన్నది లేఖలో బోర్డు వెల్లడించలేదు.
