హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ నెల 18, 19 తేదీల్లో ఎస్సీ, ఎస్టీ పార్లమెంటరీ కమిటీ పర్యటించనుంది. రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం, కమిటీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈ కమిటీలో లోక్‌సభ, రాజ్యసభకు చెందిన మొత్తం 30 మంది ఎంపీలు ఉన్నారు. ఈ కమిటీలో తెలంగాణ నుంచి ఎంపీ మల్లు రవి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు సభ్యులుగా ఉన్నారు.
ఈ పర్యటనలో భాగంగా కమిటీ మొత్తం 39 కీలక అంశాలపై చర్చించనుందని ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, హౌసింగ్, విద్య, హోం, సాధారణ పరిపాలన, ప్లానింగ్, ఆరోగ్యం, పంచాయతీ రాజ్ సహా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీలకు అమలవుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, వాటి పురోగతిని కమిటీ క్షుణ్ణంగా పరిశీలించనుంది. కమిటీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, నివేదికలపై అన్ని శాఖల స్పెషల్ సీఎస్‌లు, ప్రిన్సిపల్ సెక్రటరీలతో సీఎస్ సంజయ్ జాజు త్వరలోనే ముందస్తు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
