హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఏపీ శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి కన్నుమూశారు. బుధవారం హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలోని తన స్వగృహంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి రాష్ర్టంలో శాసనమండలి పునరుద్దరణ తరువాత కౌన్సిల్ చైర్మన్ గా చక్రపాణి పనిచేశారు. ఆయన మృతికి ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం తెలిపారు. 1983 నుంచి 1985 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్గా పనిచేశారు.
2007 ఏప్రిల్లో శాసనమండలి పునరుద్ధరణ అనంతరం తొలి ఛైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా 2017 మే వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్గా కొనసాగారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయనకు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. సభా వ్యవహారాల నిర్వహణలో, పార్లమెంటరీ సంప్రదాయాల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. ప్రజా సమస్యలపై చర్చలకు, శాసన ప్రక్రియకు తన అనుభవాన్ని వినియోగించారు. చక్రపాణి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ..పార్లమెంటరీ సంప్రదాయాల పట్ల అపారమైన గౌరవం కలిగిన చక్రపాణి చైర్మన్గా నిష్పక్షపాతంగా వ్యవహరించారని పేర్కొన్నారు.
