- ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ సభకు రాని నేతలపై హైకమాండ్ సీరియస్
- హాజరు కాని వారి లిస్ట్ సిద్ధం చేయాలని పీసీసీ చీఫ్‌కు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ‘ఇండియా’ కూటమి నిర్వహించిన ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ నిరసన ర్యాలీ, సభకు హాజరుకాని తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, పార్టీ ఆఫీస్ బేరర్లపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి పీసీసీ నుంచి పిలుపు ఉన్నప్పటికీ.. పలువురు నేతలు గైర్హాజరు కావడాన్ని ఢిల్లీ పెద్దలు తీవ్రంగా పరిగణించారు.
హైకమాండ్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సభకు దూరంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అనుబంధ సంఘాల బాధ్యుల లిస్ట్‌ను సేకరించాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌ను హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
దీంతో తెలంగాణలోని ఏయే జిల్లాల నుంచి ఏ ప్రజాప్రతినిధి, ఏ హోదాలో ఉన్న నాయకుడు సభకు రాలేదనే సమాచారాన్ని సేకరించే పనిలో పీసీసీ నిమగ్నమైంది. ఇప్పటికే గైర్హాజరైన నేతల ప్రాథమిక జాబితాను సిద్ధం చేసి, వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఆ నోటీసులు పంపించిన అనంతరం వారి నుంచి వచ్చేజవాబు సంతృప్తికరంగా లేకుంటే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
యూత్‌కాంగ్రెస్‌లో 13 మంది సస్పెన్షన్
హైకమాండ్ ఆదేశాలతో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి తన కార్యవర్గంలోని 13 మందిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇందులో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటు ఐదుగురు ప్రధాన కార్యదర్శులు, ఏడుగురు కార్యదర్శలు ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా మార్చ్చేపడ్తే అందులో భాగస్వాములు కావాల్సిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఆఫీసు బేరర్లు, తమకేమీ పట్టనట్టు వ్యవహరించడంతో వీరిపై సస్పెన్షన్ వేటు వేసినట్టు శివ చరణ్ రెడ్డి మీడియాకు చెప్పారు.
