- వ్యవసాయ కూలీలకు ఉపాధి, చెరువులు, కుంటలు, బావుల పునరుద్ధరణే ధ్యేయం: మంత్రి ఉత్తమ్
- వీబీ జీ రాంజీ పథకం కింద 355 రకాల పనులు గుర్తించినట్లు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పిస్తూనే.. ఎల్‌నినో పరిస్థితుల వల్ల తలెత్తే నీటి కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. పల్లెల్లో చెరువులు, కుంటలు, బావుల పునరుద్ధరణ, వాటి పరిరక్షణే ధ్యేయంగా 6 నెలలపాటు మెగా మిషన్చేపడుతామన్నారు.
వచ్చే జనవరి నుంచి జూన్ వరకు వర్షాకాలానికి ముందే దీన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. గురువారం సెక్రటేరియెట్‌లో ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులతో ఆయన రివ్యూ చేశారు. భూగర్భజలాలను భారీగా పెంచడంతోపాటు సాగునీటి మౌలిక వసతులను పటిష్టం చేయడమే తమ లక్ష్యమన్నారు.
వీబీ జీ రాంజీ పథకం కింద 355 రకాల పనులను గుర్తించినట్లు చెప్పారు. మైనర్ ఇరిగేషన్ చెరువులు, గ్రామ కుంటలు, ఫీడర్ చానళ్లు, కాలువల్లో పేరుకుపోయిన పూడికతీత, దెబ్బతిన్న తూములను బాగు చేయడం, కట్టలపై పెరిగిన పిచ్చిమొక్కలు, కంపచెట్లను తొలగించడం, చెరువుల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా మరమ్మతులు చేస్తామన్నారు.
చిన్న నదులు, వాగులు, వంకలపై చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టి వర్షపు నీరు వృథాగా పోకుండా అడ్డుకట్ట వేసి, భూగర్భ జలాలు రీచార్జ్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇరిగేషన్, గ్రామీణాభివృద్ధి శాఖల సమన్వయంతో పొలాల్లో ఫీల్డ్ చానెల్స్ తవ్విస్తామని పేర్కొన్నారు.
రాజస్థాన్, మహారాష్ట్ర విధానాలపై అధ్యయనం చేయండి
భూగర్భజలాల పెంపులో విజయవంతమైన రాజస్థాన్, మహారాష్ట్ర విధానాలపై అధ్యయనం చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. నీటి ఎద్దడి నివారణ, భవిష్యత్ అవసరాలపై చర్చించేందుకు త్వరలోనే జిల్లాస్థాయి గ్రౌండ్ వాటర్ ఆఫీసర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజల్లో విస్తృత స్పందన తెచ్చేలా, వారి భాగస్వామ్యం పెరిగేలా ఈ మిషన్‌కు ఒక ఆకర్షణీయమైన పేరును సూచించాలని కోరారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్, పంచాయతీరాజ్ కమిషనర్ డి.దివ్య, ఇరిగేషన్ ఈఎన్సీ(జనరల్) ఒ.వి.రమేశ్ బాబు, మిషన్ భగీరథ ఈఎన్సీ జి.కృపాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
