బియ్యం ధరలు తగ్గట్లే..! MRPని లెక్కచేయని వ్యాపారులు.. మండుతున్నధరలు..

బియ్యం ధరలు తగ్గట్లే..! MRPని లెక్కచేయని వ్యాపారులు.. మండుతున్నధరలు..
  • సర్కారు దగ్గర ఏడాదికి సరిపడా 28.35 లక్షల టన్నుల స్టాక్
  • మిల్లర్లు, వ్యాపారుల దగ్గర 25 లక్షల టన్నుల సన్నబియ్యం
  • రూ.66 బియ్యం రూ.85కు.. రూ.79 బియ్యం రూ.98కి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రేషన్, సంక్షేమ పథకాలకు ఏడాదికి సరిపడా బియ్యం నిల్వలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మిల్లర్లు, వ్యాపారుల దగ్గర కూడా లక్షల టన్నుల సన్నబియ్యం నిల్వ ఉంది. అయినా బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు చుక్కలనంటుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎంఆర్‌‌‌‌‌‌‌‌పీ ప్రకటించి, అక్రమ నిల్వలపై దాడులు చేస్తున్నా వ్యాపారులు బెదరడం లేదు. సర్కారు ధరలను కాకుండా తాము నిర్ణయించిన అధిక రేట్లకే అమ్ముతున్నారు.

నిల్వల లెక్క ఇదీ

సివిల్ సప్లైస్ గోదాముల్లో ప్రస్తుతం 10.17 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉంది. మిల్లర్ల దగ్గర ఉన్న 27.13 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే మరో 18.18 లక్షల టన్నుల బియ్యం వస్తుంది. రెండూ కలిపి 28.35 లక్షల టన్నులు. రాష్ట్రంలో రేషన్, హాస్టళ్లు, మధ్యాహ్న భోజనానికి నెలకు 2.38 లక్షల టన్నులు, ఏడాదికి 28.56 లక్షల టన్నులు అవసరం. 

అంటే వచ్చే ఏడాది అక్టోబర్ వరకు సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తెలిపారు. మరోవైపు గత వానాకాలంలో మిల్లర్లు, వ్యాపారులు సేకరించిన దాంట్లో 25 లక్షల టన్నులకు పైగా సన్నబియ్యం ఇప్పటికీ వారి దగ్గరే ఉంది. ఇన్ని నిల్వలున్నా మిల్లర్లు, బడా వ్యాపారులు కుమ్మక్కై కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 

ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో పేరుతో ధరలు అడ్డూఅదుపు లేకుండా పెరగడంపై ‘మిల్లర్ల సన్నబియ్యం దందా’ పేరుతో ‘వెలుగు’ కథనం ప్రచురించింది. దీంతో పౌరసరఫరాల శాఖ సన్నబియ్యానికి ఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీలు ఖరారు చేసింది. ఎక్కువ ధరకు అమ్మితే పీడీ యాక్ట్, క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించింది. అయినా మార్కెట్లో మార్పు లేదు.

తనిఖీలు నామమాత్రమే

పౌరసరఫరాలు, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, పోలీస్, జీఎస్టీ, తూనికలు–కొలతల శాఖలు సంయుక్తంగా హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్ గంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, రిటైల్ మార్కెట్లు, మిల్లర్ల గోదాములపై తనిఖీలు చేస్తున్నట్లు చెబుతున్నా, అవి ఫొటోలకే పరిమితమవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులు వెళ్లిన కాసేపటికే పాత ధరలకే అమ్మకాలు సాగుతున్నాయి. 

సర్కారు ధరల బోర్డులకు బదులు సొంత రేట్ల బోర్డులనే దుకాణదారులు బహిరంగంగా పెడుతున్నారు. ఇన్ని నిల్వలున్నప్పుడు రైతుబజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా తక్కువ ధరకు ప్రభుత్వమే నేరుగా ఎందుకు అమ్మడం లేదని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. సిండికేట్లను బద్దలు కొట్టేలా లైసెన్సుల రద్దు, జైలు శిక్షల వంటి కఠిన చర్యలు తీసుకుంటేనే ధరలు దిగొస్తాయని అంటున్నారు. 

బియ్యం రకం       సర్కారు ఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ (కిలో)    మార్కెట్లో అమ్ముతున్న ధర (కిలో)

బీపీటీ, కేఎన్ఎం          రూ.66                                    రూ.85 వరకు
తెలంగాణ సోనా          రూ.74    –
హెచ్ఎంటీ, జై శ్రీరామ్    రూ.79                                  రూ.90 నుంచి రూ.98