హైదరాబాద్, వెలుగు: పేదల సొంతింటి కల సాకారమైన శుభవేళ.. ఈ దీపావళి పండుగను ఇందిరమ్మ ఇంట్లోనే లబ్ధిదారులతో కలిసి జరుపుకోనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఆయన ‘ఎక్స్’లో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి..!’ అంటూ ఒక ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదల సొంతింటి కల నెరవేరుతున్న వేళ, ఈ దీపావళి పర్వదినం మరింత ప్రత్యేకతను సంతరించుకుందని పేర్కొన్నారు.
లబ్ధిదారులు తమ నూతన ఇందిరమ్మ ఇండ్లలో సొంతింటి సంతోషాన్ని అనుభవిస్తున్న ఈ శుభసమయంలో, వారి ఆనందంలో తాను సైతం పాలుపంచుకోనున్నట్లు వెల్లడించారు. ఈ పండుగ రోజున స్వయంగా ఒక ఇందిరమ్మ ఇంటికి వెళ్లి, అక్కడి లబ్ధిదారుల కుటుంబంతో కలిసి దీపావళి వేడుకలను అత్యంత ఆత్మీయంగా జరుపుకోబోతున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు కూడా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి వారితో కలిసి పండుగ సంబురాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు సైతం తమ ప్రాంతాల్లోని ఇందిరమ్మ ఇండ్లకు వెళ్లాలని సూచించారు. సొంత గూడు దక్కిన ఆనందంలో ఉన్న లబ్ధిదారుల ఇండ్లను సందర్శించి, వారితో కలిసి దీపావళి పండుగను జరుపుకోవాలని పేర్కొన్నారు.
