హార్ట్ ఫెయిల్యూర్ వెనక  కొత్త జన్యు లోపాలు... సీసీఎంబీ, ఓయూ, ఏఐజీ హాస్పిటల్ రీసెర్చ్‌‌‌‌లో వెల్లడి

హార్ట్ ఫెయిల్యూర్ వెనక  కొత్త జన్యు లోపాలు... సీసీఎంబీ, ఓయూ, ఏఐజీ హాస్పిటల్ రీసెర్చ్‌‌‌‌లో వెల్లడి
  • తెలంగాణ రోగులపై జరిపిన అధ్యయనంలో గుర్తింపు
  • గుండె సమస్యలను ముందే పసిగట్టే చాన్స్​ 

హైదరాబాద్, వెలుగు: గుండె కండరం అసాధారణంగా మందమై, రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తూ చివరికి హార్ట్ ఫెయిల్యూర్‌‌‌‌కు దారితీసే హైపర్‌‌‌‌ట్రోఫిక్ కార్డియోమయోపతి (హెచ్‌‌‌‌సీఎం) వ్యాధికి సంబంధించి రెండు కొత్త జన్యు మార్పులను హైదరాబాద్ సైంటిస్టులు గుర్తించారు. హైదరాబాద్‌‌‌‌లోని సీఎస్‌‌‌‌ఐఆర్‌‌‌‌ – సీసీఎంబీ రీసెర్చర్లు డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, డాక్టర్ దీపా సెల్వి రాణిల నేతృత్వంలో ఉస్మానియా వర్సిటీకి చెందిన డాక్టర్ ప్రతిభా నల్లారి, ఏఐజీ హాస్పిటల్‌‌‌‌కు చెందిన డాక్టర్ కలంబూర్ నరసింహన్ టీమ్ ఈ అధ్యయనం చేపట్టింది. 

గుండె కండరం సంకోచించి రక్తాన్ని పంప్ చేయడానికి అవసరమైన శక్తిని అందించే 'ఎంవైహెచ్‌‌‌‌7’ అనే కీలక జన్యువులో ఈ మార్పులు ఉన్నట్లు గుర్తించారు. ఈ రీసెర్చ్ వివరాలు 'జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ ఆసియా' నవంబర్ సంచికలో ప్రచురితమయ్యాయి.

వయసు పెరిగే కొద్దీ వ్యాధి తీవ్రత..

తెలంగాణకు చెందిన 160 మంది హెచ్‌‌‌‌సీఎం గుండె రోగులు, మరో 178 మంది ఆరోగ్యవంతుల జన్యువులను విశ్లేషించి ఈ అధ్యయనం చేశారు. రోగుల్లో గుర్తించిన 34 జన్యు మార్పుల్లో రెండు వేరియంట్లు (p.Met684Arg, p.Leu725Pro) అత్యంత ప్రమాదకరమైనవిగా తేలాయి. గుండె కండరం తీవ్రంగా మందమైన 52 ఏండ్ల మహిళలో ఒక వేరియంట్‌‌‌‌ను గుర్తించగా, అదే మార్పు ఉన్న ఆమె 26 ఏండ్ల కొడుకులో కండరం స్వల్పంగానే మందమైంది. 

ఆకస్మిక గుండెపోటు మరణాల చరిత్ర ఉండి, రక్త ప్రసరణకు ఆటంకం కలిగించే అబ్‌‌‌‌స్ట్రక్టివ్ హెచ్‌‌‌‌సీఎంతో బాధపడుతున్న 58 ఏండ్ల వ్యక్తిలో రెండో వేరియంట్ బయటపడింది. అదే జన్యు మార్పు కలిగిన అతని 24 ఏండ్ల కుమార్తెలో గుండె కండరం స్వల్పంగా మందమైంది. దీన్నిబట్టి ఒకే జన్యు లోపం ఉన్నప్పటికీ, వయసు పెరిగే కొద్దీ గుండెపై దీని ప్రభావం, వ్యాధి తీవ్రత పెరుగుతున్నాయని రీసెర్చర్లు స్పష్టం చేశారు.

మనవాళ్లకే ముప్పు ఎక్కువ..

ప్రపంచవ్యాప్త జన్యు డేటా బేస్‌‌‌‌ల్లో లేని ఈ రెండు అరుదైన మార్పులు ప్రధానంగా భారతీయ లేదా దక్షిణాసియా జనాభాలోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ తెలిపారు. ఈ వ్యాధికారక మార్పులను గుర్తించడం వల్ల రోగులకు సరైన సమయంలో చికిత్స అందించేందుకు వీలవుతుందని చెప్పారు. 

భవిష్యత్ తరాల్లో వంశపారంపర్యంగా వచ్చే గుండె జబ్బులను ముందే అడ్డుకోవడానికి, ప్రజల్లో ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి వ్యాధిని ప్రారంభంలోనే పసిగట్టేందుకు ఈ రీసెర్చ్ ఎంతో ఉపయోగపడుతుందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి పేర్కొన్నారు.