- గోదావరి తీరానికి మంత్రులు, ఎమ్మెల్యేలు పోవాలె
- అక్కడే ప్రెస్‌మీట్లు పెట్టి పరిస్థితిని మీడియాకు చెప్పాలె
- ఏపీకి నీళ్లంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలె
- కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశంనెలాఖరులో నిర్వహించి.. రిపేర్ల లెక్కలు చెబుదాం
- గోదావరి తీరానికి మంత్రులు, ఎమ్మెల్యేలు పోవాలె
- అక్కడే ప్రెస్‌మీట్లు పెట్టి పరిస్థితిని మీడియాకు చెప్పాలె
- ఏపీకి నీళ్లంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలె
- కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలను ప్రజల ముందుంచేందుకు ఈ నెలాఖరులో రెండు రోజుల పాటు రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు దెబ్బతిన్న నాటి నుంచి మూడేళ్లుగా చేపడుతున్న వివిధ రిపేర్లు, పునరుద్ధరణ పనుల సమగ్ర వివరాలను సభా వేదికగా ప్రజలకు, సభ్యులకు పూసగుచ్చినట్లు వివరించాలని కేబినెట్ తీర్మానించినట్లు తెలిసింది. నెలాఖరులోగా ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు, మంత్రులకు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటే క్షేత్రస్థాయిలోనూ ప్రజాప్రతినిధులు విస్తృతంగా పర్యటించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కాళేశ్వరం, గోదావరి పరివాహక ప్రాంత జిల్లాలకు చెందిన మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు తక్షణమే గోదావరి నదీ తీరాలను క్షేత్రస్థాయిలో సందర్శించాలని ఆదేశించినట్లు సమాచారం.
గోదావరి నది నుంచి సహజంగా వస్తున్న నీటి ప్రవాహం ఎంత? ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిస్థితుల్లో ఎత్తిపోతల (లిఫ్ట్) ప్రక్రియ ఏ విధంగా సాగుతోంది? అనే వాస్తవాలను స్థానిక ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించాలని సీఎం సూచించినట్లు తెలిసింది. అంతేకాకుండా, హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయాలు, ప్రెస్‌క్లబ్‌లలో కాకుండా నేరుగా గోదావరి నది వద్దే మీడియా ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రాజెక్టు వాస్తవాలను ఆధారాలతో సహా వివరించాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం.
నిజాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలి
ఇదే సమయంలో గోదావరి జలాలపై జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారాన్ని తీవ్రంగా తిప్పికొట్టాలని మంత్రివర్గ భేటీలో సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. గోదావరి నీటిని ఏపీకి తరలించారంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అసత్య ప్రచారాల్లోని నిజాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని మంత్రులను ఆదేశించినట్లు సమాచారం.
సాంకేతికంగా నీటిని ఎలా ఒడిసిపడుతున్నాం, దిగువకు నీరు ఎందుకు వెళ్తోంది, బ్యారేజీల రక్షణకు నిపుణులు ఇచ్చిన నివేదికలేమిటి అనే విషయాలపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని సీఎం నిర్దేశించినట్లు తెలిసింది. అసెంబ్లీలో సమగ్ర చర్చతో పాటు, గోదావరి వద్ద ప్రత్యక్షంగా నిజాలను చాటిచెప్పడం ద్వారా విపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కోవాలని కేబినెట్ నిర్ణయించినట్లు సమాచారం.
