- థర్డ్ ఫ్రంట్ పేరుతో కలిసిన మమత, నవీన్, జగన్కు ఓటమి
- చివరికి కేసీఆర్ కూడా అధికారం కోల్పోయారు
- రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది
- 2028లో తెలంగాణలో కాషాయ జెండా ఖాయం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయంగా ఐరన్ లెగ్గా మారారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రామ్ మాధవ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఖతం అయిపోయిందని, కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేసే బీజేపీ 2028లో అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
గురువారం హైదరాబాద్లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో దేశమంతా తిరిగి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటూ కేసీఆర్ ఎవరెవరినైతే కలిశారో.. వాళ్లంతా రాజకీయంగా చావుదెబ్బ తిన్నారని రామ్ మాధవ్ ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, ఒడిశాలో నవీన్ పట్నాయక్, చివరకు ఏపీలో జగన్ మోహన్ రెడ్డి లాంటి నేతలంతా ఘోర పరాజయాన్ని చవిచూశారని గుర్తుచేశారు. చివరకు కేసీఆర్ కూడా అధికారం కోల్పోయి ప్రజల చేతిలో ఔట్ అయ్యారని చురకలంటించారు.
రాహుల్ ఫారిన్ టూర్లు.. సీఎం ఢిల్లీ చక్కర్లు..
ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ సమస్యలను గాలికొదిలేసి సగం కాలం విదేశాల్లో గడుపుతుంటే, మరోవైపు సీఎం రాష్ట్ర పాలనను వదిలేసి ఢిల్లీ పర్యటనలకే పరిమితమయ్యారని రామ్ మాధవ్ పేర్కొన్నారు. 1990ల నుంచే సుష్మా స్వరాజ్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడి పార్లమెంట్లో గళమెత్తిన ఘనత బీజేపీకే దక్కుతుందని గుర్తుచేశారు. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు నేతృత్వంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్న భాగ్యనగర పాదయాత్రకు, అలాగే నిర్మల్ మహాపాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు.
2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజామోదంతో గెలవలేక వరుస ఓటములను జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ.. ఈవీఎంలు, ఓట్ల చోరీ పేరిట కేంద్ర ఎన్నికల సంఘంపై నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు. వీరి వెంట బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పార్టీ నేతలు కాసం వీరేందర్ గౌడ్, ఎన్వీ సుభాష్, సందీప్ సాయి తదితరులు పాల్గొన్నారు.
