- రిటైర్డ్ ఉద్యోగి చనిపోయినా.. సర్వీసులో ఉన్నట్లు ఫేక్ సర్టిఫికెట్
- కలెక్టర్ ఆదేశాలతో విచారణ.. డాక్టర్ సూర్యశిల్పపై వేటు
హైదరాబాద్, వెలుగు: వైద్యారోగ్య శాఖలో తప్పుడు ధ్రువపత్రాలతో అక్రమంగా కారుణ్య నియామకం చేపట్టిన వ్యవహారంలో శాలిగౌరారం పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సూర్యశిల్పపై సస్పెన్షన్ వేటు పడింది. నకిరేకల్ మండలం ఓగోడుకు చెందిన హెల్త్ అసిస్టెంట్ చామకూరి వెంకటేశ్వర్లు సర్వీసు పూర్తిచేసుకుని రిటైర్ అయ్యాక అనారోగ్యంతో మృతి చెందారు. అయితే, ఆయన సర్వీసులో ఉండగానే చనిపోయినట్లు తప్పుడు డెత్ సర్టిఫికెట్ సృష్టించారు.
అనంతరం ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే శాలిగౌరారం పీహెచ్సీ, డీఎంహెచ్వో కార్యాలయ సిబ్బంది సహకారంతో ఆయన కుమారుడికి దామరచర్ల పీహెచ్సీలో ఉద్యోగం ఇప్పించారు. ఈ అక్రమ నియామకంపై విచారణ చేపట్టాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. వైద్యాధికారి సూర్యశిల్ప లక్షల్లో లంచం తీసుకుని నియామక పత్రాలు అందజేసినట్లు గుర్తించి ఆమెను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణంలో డీఎంహెచ్వో కార్యాలయ ఉద్యోగులు, ఇతర సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు.
