కొనుగోలు సెంటర్లు వెలవెల.. కల్లాల దగ్గరే అమ్ముకుంటున్న రైతులు

కొనుగోలు సెంటర్లు వెలవెల.. కల్లాల దగ్గరే అమ్ముకుంటున్న రైతులు
  • నెల రోజుల్లో కొన్నది 48 వేల టన్నులే..
  • బహిరంగ మార్కెట్‌‌‌‌లో భారీగా ధరలు..
  • జైశ్రీరాం ధాన్యానికి రికార్డుస్థాయిలో రేటు     
  • రాష్ట్రంలో 8వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
  • అయినా సెంటర్ల వైపు చూడని అన్నదాతలు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. వానాకాలం సీజన్​లో 65 లక్షల టన్నుల వడ్లు కొనాలని టార్గెట్ పెట్టుకున్న సివిల్ సప్లయ్స్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 8,224 కేంద్రాలు ఏర్పాటు చేసింది. 

అక్టోబర్ మొదటివారంలోనే సెంటర్లు ప్రారంభించినా నెలరోజుల్లో కేవలం 48 వేల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. అందులో ఎక్కువగా దొడ్డు రకాల ధాన్యమే ఉంది. ఇప్పటికీ రైతులు ఆశించిన స్థాయిలో ధాన్యాన్ని సెంటర్లకు తీసుకురావడంలేదు.

బహిరంగ మార్కెట్‌‌‌‌లో వడ్లకు డిమాండ్..

బహిరంగ మార్కెట్‌‌‌‌లో ధాన్యానికి భారీగా డిమాండ్ ఉండటంతో రైతులు సెంటర్లకు వడ్లు తేవడంలేదు. వ్యాపారులు నేరుగా రైతుల కల్లాల దగ్గరకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పంట కోతయంత్రాలను తీసుకెళ్లి మరీ కోతలు కాగానే కొనుగోలు చేస్తున్నారు. 

కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించడం, అక్కడ రోజుల తరబడి వేచి ఉండటం కంటే పొలం దగ్గరే మద్దతు ధర కన్నా ఎక్కువ ఇచ్చి కొంటున్న వ్యాపారులకే వడ్డు అమ్మడం మేలని రైతులు అంటున్నారు. దీంతో రైతులు ప్రభుత్వ కేంద్రాల వైపు చూడటం లేదు. ఈ వానాకాలం సీజన్‌‌‌‌లో రాష్ట్రవ్యాప్తంగా 56.59 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దాదాపు కోటిన్నర టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. 

ఇందులో 65 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని సివిల్ సప్లయ్స్ శాఖ ప్రణాళిక రూపొందించింది. ముందస్తుగా వరినాట్లు వేసిన నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో కొనుగోళ్లను ప్రారంభించి ఆ తర్వాత అన్ని జిల్లాల్లో సెంటర్లను తెరిచింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణ, రవాణా ప్రక్రియకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే, కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాకపోవడంతో లక్ష్యం చేరుకోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

జైశ్రీరాం ధాన్యానికి ఫుల్ గిరాకీ.. 

రాష్ట్రంలో జైశ్రీరాం సన్న ధాన్యం ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల మార్కెట్‌‌‌‌లో ఈ రకం పాత ధాన్యం క్వింటాల్‌‌‌‌కు గరిష్ఠంగా రూ.5,555 ధర పలికింది. కనిష్ఠ ధర రూ.3,960 కాగా, సగటున రూ.5,080 నమోదైంది. ఆర్ఎన్ఆర్ రకానికి గరిష్ఠంగా రూ.4,885, హెచ్‌‌‌‌ఎంటీ సోనా ధాన్యానికి రూ.4,930 ధర లభించింది. మార్కెట్‌‌‌‌లో సన్న ధాన్యానికి భారీ ధరలు వస్తుండటంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్మేందుకే మొగ్గు చూపుతున్నారు.

లక్ష్యం చేరడం కష్టమే..

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర, బోనస్‌‌‌‌తో పోలిస్తే బహిరంగ మార్కెట్‌‌‌‌లో లభిస్తున్న ధరలు ఎక్కువగా ఉండడంతో టార్గెట్ చేరడం సివిల్ సప్లయ్స్ శాఖకు సవాలుగా మారింది. నెలరోజుల్లో కేవలం 48 వేల టన్నుల వడ్లు మాత్రమే సేకరించగా, సీజన్‌‌‌‌ చివరి వరకు కొనుగోళ్లు ఏ మేరకు జరుతాయన్నది సందిగ్ధంగా ఉంది. మార్కెట్ లో వడ్లకు ఇవే ధరలు కొనసాగితే 65 లక్షల టన్నుల ధాన్యం సేకరణ కష్టసాధ్యమేనని ఆఫీసర్లు భావిస్తున్నారు.
 
సన్న వడ్లకు రికార్డు ధరలు..

ఎల్‌‌‌‌నినో ఎఫెక్ట్, వర్షాభావం వల్ల దిగుబడులపై ఆందోళనలు నెలకొనడం, మార్కెట్‌‌‌‌లో సన్న బియ్యానికి డిమాండ్ పెరగడం ధాన్యం ధరలకు ఊతమిస్తున్నాయి. బ్రాండెడ్ బియ్యం కంపెనీలు, వ్యాపారులు పోటీపడి సన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా జైశ్రీరాం, ఆర్ఎన్ఆర్, హెచ్‌‌‌‌ఎంటీ సోనా వంటి రకాల ధాన్యానికి భారీ ధరలు పలుకుతున్నాయి. 

ప్రభుత్వం ఎంపిక చేసిన ఏడు సన్న రకాల ధాన్యానికి క్వింటాల్‌‌‌‌కు రూ.500 బోనస్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం కామన్ రకానికి రూ.2,441, గ్రేడ్-ఏ రకానికి రూ.2,461 మద్దతు ధర ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 7రకాల సన్న వడ్లకు బోనస్‌‌‌‌తో కలిపి క్వింటాల్‌‌‌‌కు రూ.2,941 వరకు ధర లభించనుంది. అయితే, బహిరంగ మార్కెట్‌‌‌‌లో అంతకన్నా ఎక్కువ రేటు వస్తుతుండటంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు రావడంలేదు.