- అదే రోజు ఇందిరమ్మ చీరల పంపిణీ స్టార్ట్
- ఈ నెల 20 నుంచి 30 వరకు ఇందిరమ్మ కమిటీలు
- ఎస్సీ, ఎస్టీ కమిషన్ రద్దు చేసిన కేబినెట్
- ఆ స్థానంలో ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు
- ఫైర్ సర్వీస్ యాక్ట్- 1999 సవరణకు ఓకే
- న్యాయశాఖలో 136 పోస్టుల భర్తీకి ఆమోదం
- మీడియాకు వివరాలు వెల్లడించిన మంత్రులు
- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి, వాకిటి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షల ఆర్థిక ధీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ఈ నెల 19న సిద్దిపేట నుంచి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ఈమేరకు పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ వేదికగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో పాటు ఇందిరమ్మ చీరల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మంత్రులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షల బీమా వర్తింపజేసేందుకు ఈ నెల 20 నుంచి 30 వరకు గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులు సేకరించి, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులకు అందజేస్తారని వెల్లడించారు.
ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు సంబంధించి ప్రభుత్వం మరో చారిత్రక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉమ్మడి ఎస్సీ, ఎస్టీ కమిషన్ రద్దు చేసి, ఎస్సీలకు, ఎస్టీలకు వేర్వేరుగా స్వతంత్ర కమిషన్లు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ‘తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ యాక్ట్–2003’ను రద్దు చేసేందుకు ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటయ్యే ప్రతి కమిషన్‌లో ఒక చైర్మన్, ఐదుగురు సభ్యులు ఉంటారని, బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని మంత్రులు వెల్లడించారు.
దీపావళి సందర్భంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కేబినెట్నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 2,25,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో కలిసి పండుగ జరుపుకుంటారని తెలిపారు.
ఫైర్ సర్వీస్ యాక్ట్-1999 సవరణకు ఆర్డినెన్స్
అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ తెలంగాణ ఫైర్ సర్వీస్ యాక్ట్–1999 సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్ జారీకి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అగ్ని ప్రమాదాలకు గల కారణాలను గుర్తించడం, అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించడం, ఇళ్లు, అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల యజమానులు పాటించాల్సిన నిబంధనలను ఇందులో చేర్చనున్నారు.
తెలంగాణ సర్వే, సరిహద్దుల చట్టం–1923లోని సెక్షన్ 12(ఏ) సవరణకు ఆమోదం తెలిపారు. సర్వే, సరిహద్దులకు సంబంధించి జారీ చేసే నోటీసులపై అప్పీల్ చేసుకునే గడువును 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
వివిధ కోర్టుల్లో 136 కొత్త పోస్టుల మంజూరు
రాష్ట్ర న్యాయవ్యవస్థను బలోపేతం చేసేలా వివిధ కోర్టుల్లో మొత్తం 136 కొత్త పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో కొత్తగా ఏర్పాటైన జూనియర్ సివిల్ జడ్జి కమ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుతో పాటు, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి కోర్టు కోసం 56 పోస్టులను మంజూరు చేశారు.
వీటితో పాటు సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని నాలుగు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుల్లోని వివిధ విభాగాల కోసం మరో 80 పోస్టులకు ఆమోదముద్ర వేశారు. తద్వారా కోర్టుల్లో కేసుల సత్వర పరిష్కారానికి, న్యాయ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మార్గం సుగమమైందని మంత్రులు వివరించారు.
