గంజాయి కొనుడేందని సాగే చేసిండు.. కైసర్నగర్లో ఓపెన్ ప్లాట్లో రెండు మొక్కల పెంపకం

గంజాయి కొనుడేందని సాగే చేసిండు.. కైసర్నగర్లో ఓపెన్ ప్లాట్లో రెండు మొక్కల పెంపకం
  • పట్టుకున్న పోలీసులు 

కుత్బుల్లాపూర్​, వెలుగు: గంజాయి కొంటే డబ్బులు ఎక్కువవుతున్నాయని ఓ వ్యక్తి ఏకంగా తన ఓపెన్​ప్లాట్​లోనే గంజాయి సాగు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రైడ్స్​చేసి అతడిని అరెస్ట్​చేశారు. బోరబండి అల్లాపూర్​కి చెందిన ఎండీ అయాజ్​వ్యాస్​ (54) వెల్టర్. ఇతడు కొంతకాలంగా గంజాయి వాడుతున్నాడు. బయట కొంటే డబ్బులు పెట్టాల్సి రావడంతో ‘మనమే పెంచుకుంటే పోలా’ అనే ఆలోచన వచ్చింది.

 ఇతడికి గాజులరామారం కైసర్​నగర్​లో ఓపెన్​ప్లాట్​ఉండడంతో అందులో రెండు మొక్కలను నాటాడు. అల్లాపూర్​ నుంచి తరచూ వచ్చి నీళ్లు పోసి పోయేవాడు. దీంతో ఒక మొక్క ఐదడుగులు, మరో మొక్క నాలుగు అడుగులు పెరిగింది. పోలీసులకు సమాచారం రావడంతో గురువారం తనిఖీలు చేయగా గంజాయి మొక్కలు కనిపించాయి.

అయాజ్​ను అదుపులోకి తీసుకుని​ప్రశ్నించగా.. ‘అవును..నేను వాడుకోవడానికే పెంచాను..బయట కొంటే డబ్బులు ఎక్కువగా పెట్టాల్సి వస్తున్నది’ అని సమాధానం ఇచ్చాడు. సీఐ బాలరాజు నిందితుడిని అరెస్ట్​చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.