- మళ్లీ 24,500 మార్కును దాటిన నిఫ్టీ
- ఏడు నెలల్లో ఇదే అతిపెద్ద ర్యాలీ
- రూ.6.5 లక్షల కోట్లు పెరిగిన సంపద
- 100 డాలర్ల దిగువకు బ్రెంట్ క్రూడ్ ధర
- రూ.14,975 కోట్ల ఎఫ్ఐఐల కొనుగోళ్లు
- బ్యాంక్, ఆటో షేర్లలో కొనుగోళ్ల జోరు
ముంబై: అమెరికా రాజకీయ పరిణామాలు భారత స్టాక్ మార్కెట్‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగలడం, డెమోక్రాట్లు కాంగ్రెస్‌పై పట్టు సాధించడం అంతర్జాతీయ మార్కెట్లలో కీలక పరిణామంగా మారింది. ట్రంప్ విధానాలపై ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారన్న సంకేతాలతో పాటు అమెరికా–ఇరాన్ యుద్ధం ముగిసే అవకాశం ఉందన్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆశలు పెంచాయి.
ఈ పరిణామాలకు ముడిచమురు ధరల పతనం, విదేశీ పెట్టుబడుల రాక తోడవడంతో గురువారం భారత స్టాక్ మార్కెట్ భారీ ర్యాలీ చేసింది. సెన్సెక్స్ రెండు వేల పాయింట్లకు పైగా ఎగబాకగా, నిఫ్టీ 24,500 స్థాయిని తిరిగి దక్కించుకుంది. ఇన్వెస్టర్ల సంపద రూ.7.85 లక్షల కోట్లు పెరిగింది. ఓటమి కారణంగా ట్రంప్ నిర్ణయాలపై నియంత్రణ పెరగవచ్చని అంచనా. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ఆగుతుందనే ఆశలు పెరిగాయి.
దూసుకెళ్లిన సూచీలు
ఈ సానుకూల పరిణామాల మధ్య గురువారం ఉదయం నుంచే దేశీయ మార్కెట్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఒక దశలో 2,168.63 పాయింట్లు పెరిగి 79,470.03 స్థాయిని తాకింది. చివరకు 2,008.61 పాయింట్ల (2.60 శాతం) లాభంతో 79,310.01 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 576 పాయింట్లు (2.40) శాతం పెరిగి 24,536.60 వద్ద స్థిరపడింది.
రెండు సూచీలు వరుసగా ఆరో సెషన్‌లోనూ లాభాలతో ముగిశాయి. ఈ ఆరు సెషన్లలో సెన్సెక్స్ 6,063.98 పాయింట్లు, 8.27 శాతం పెరిగింది. నిఫ్టీ 1,837.75 పాయింట్లు ఎగబాకింది. గత ఏడు నెలల్లో ఒకే రోజులో నమోదైన అతిపెద్ద పెరుగుదలగా గురువారం ర్యాలీ నిలిచింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.7.85 లక్షల కోట్లకు పైగా పెరిగి సుమారు రూ.497.48 లక్షల కోట్లకు చేరింది.
చల్లారిన చమురు మంట
యూఎస్ఎన్నికల ఫలితాల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై స్పష్టంగా కనిపించింది. బ్రెంట్ క్రూడ్ ధర గత సెషన్‌లో ఏకంగా 8.7 శాతం పడిపోయి బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు చేరింది. ఒక దశలో 94.62 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. గురువారం కొంత కోలుకుని 96 డాలర్ల సమీపంలో ట్రేడయింది. ఈ వారం ఇప్పటివరకు చమురు ధరలు సుమారు 20 శాతం తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే మనదేశం చమురు దిగుమతుల కోసం ఖర్చు పెట్టే విదేశీ మారకద్రవ్యం తగ్గుతుంది. దీంతో కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. ధరలు కూడా అదుపులోకి వస్తాయి.
బ్యాంకింగ్, ఆటో షేర్లలో కొనుగోళ్ల వెల్లువ
ఈ ర్యాలీలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటోమొబైల్ రంగాల షేర్లు ముందంజలో నిలిచాయి. సెన్సెక్స్ షేర్లలో బజాజ్ ఫైనాన్స్ 7.77 శాతం పెరిగి అగ్రస్థానంలో నిలిచింది. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ 5.80 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 5.29 శాతం, మారుతీ 5.28 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 5.15 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 4.66 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో సూచీ 4 శాతానికి పైగా పెరిగింది. బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో నిఫ్టీ బ్యాంక్ సూచీ కూడా లాభపడింది. చమురు ధరలు తగ్గడంతో ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా వంటి కంపెనీల షేర్లపై ఒత్తిడి కనిపించింది. మొత్తం 16 ప్రధాన రంగాల సూచీల్లో 14 లాభపడ్డాయి.
అమెరికా మార్కెట్లలోనూ జోష్
డెమోక్రాట్ల విజయంపై అమెరికా మార్కెట్లు కూడా సానుకూలంగా స్పందించాయి. బుధవారం డౌజోన్స్ సూచీ 1,569.40 పాయింట్లు, సుమారు 3 శాతం పెరిగింది. ఎస్‌అండ్‌పీ 500 సూచీ 1.6 శాతం, నాస్‌డాక్ 1.4 శాతం లాభపడ్డాయి. చమురు ధరలు తగ్గడం, బాండ్ ఈల్డ్స్‌పై ఒత్తిడి తగ్గడం కూడా అమెరికా మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. అమెరికాలో కాంగ్రెస్, అధ్యక్షుడి మధ్య రాజకీయ విభజన ఏర్పడటం వల్ల కొన్ని విధాన నిర్ణయాలు ఆలస్యమయ్యే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ర్యాలీ కొనసాగుతుందా?
ట్రంప్ పార్టీకి ఎన్నికల్లో ఎదురైన పరాజయం భారత మార్కెట్‌కు అనుకూలమైన అంతర్జాతీయ వాతావరణాన్ని సృష్టించింది. అయితే గురువారం ర్యాలీకి ఎన్నికల ఫలితాలే ఏకైక కారణం కాదు. ముడిచమురు ధరల పతనం, విదేశీ పెట్టుబడుల రాక, అమెరికా మార్కెట్ల లాభాలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గవచ్చన్న అంచనాలు కలిసివచ్చాయి. భారత మార్కెట్ ఈ ఏడాది ఇప్పటి వరకు నష్టాల్లోనే ఉండటం కూడా తాజా కొనుగోళ్లకు ఒక కారణంగా కనిపిస్తోంది.
ఆరు సెషన్లలోనే సూచీలు 8 శాతానికి పైగా పెరగడంతో కొంతమంది ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగే అవకాశం ఉంది. యుద్ధం కొనసాగినా, చమురు ధరలు మళ్లీ పెరిగినా మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినవచ్చు. విదేశీ పెట్టుబడుల ప్రవాహం నిలకడగా కొనసాగుతుందా, కంపెనీల లాభాలు అంచనాలకు అనుగుణంగా ఉంటాయా అన్న అంశాలు తదుపరి దిశను నిర్ణయించనున్నాయి.
విదేశీ ఇన్వెస్టర్ల రాకతో కొత్త జోరు
భారత మార్కెట్ల ర్యాలీకి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్ఐఐలు) కొనుగోళ్లు మరో ప్రధాన కారణం. గురువారం ఒక్కరోజే వీళ్లు రూ.14,974.68 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. ఈనెల 4న రూ.7,284 కోట్ల విలువైన షేర్లు దక్కించుకున్నారు. 2025 అక్టోబర్ తర్వాత ఒకే రోజులో నమోదైన అత్యధిక కొనుగోళ్లుగా ఇవే! వరుసగా నాలుగు సెషన్లలో విదేశీ పెట్టుబడులు రావడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది.
ఈ ఏడాది ఇప్పటివరకు భారత మార్కెట్ నుంచి భారీగా విదేశీ నిధులు వెనక్కి వెళ్లిన నేపథ్యంలో తాజా కొనుగోళ్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా మార్కెట్లలో ఏఐ సంబంధిత షేర్లపై ఆందోళనలు పెరగడం, ఇతర మార్కెట్లలో అవకాశాల కోసం ఇన్వెస్టర్లు వెతుకుతుండటం కూడా భారత్‌కు కలిసి వస్తోంది.
