కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు చెల్లింపుల విధానంలో భారీ మార్పులు రానున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల నిధులు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకి జమ చేసేందుకు ఇప్పటి వరకూ 'ఆధార్' కేంద్రంగా ఉంది. అయితే త్వరలోనే ఆధార్ స్థానంలో బయోమెట్రిక్, ఓటర్ ఐడీ నంబర్లను ప్రాతిపదికగా తీసుకుని చెల్లింపులు జరపనున్నట్లు కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) ప్రకటించి అందరినీ షాక్‌కి గురిచేశారు.
కేంద్ర పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లలన్ సింగ్.. ఢిల్లీలో జరిగిన 'పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ 2026-27' జాతీయ వర్క్‌షాప్‌లో ఈ కామెంట్స్ చేశారు. దేశంలోని ప్రతి గల్లీలోనూ ఆధార్ కేంద్రాలు సులభంగా అందుబాటులో ఉంటున్నాయని.. కేవలం 5 నిమిషాల్లోనే కొత్త ఆధార్ కార్డులు తయారవుతున్న వేళ.. భవిష్యత్తులో లబ్ధిదారుల గుర్తింపుకు, చెల్లింపులకు ఆధార్ కార్డ్ ప్రాతిపదిక కాబోదని ఆయన స్పష్టం చేశారు. ఆధార్ స్థానంలో లబ్ధిదారుల బయోమెట్రిక్, ఓటర్ ఐడీ కార్డులోని EPIC నంబర్ ఆధారంగానే నగదు బదిలీ చేపట్టనున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కింద నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకి నగదు జమ చేసే పథకాలు లేనప్పటికీ.. లలన్ సింగ్ నిర్వహిస్తున్న పశుసంవర్ధక, మత్స్య శాఖల పరిధిలోని 'నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్' వంటి పథకాల్లో ఆధార్ తప్పనిసరిగా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా అమలవుతున్న పీఎం-కిసాన్, ఉపాధి హామీ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, పింఛన్ల పంపిణీ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఆధార్-సీడెడ్ బ్యాంక్ ఖాతాల ద్వారానే డబ్బు బదిలీ జరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి చేసిన కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఈ కొత్త విధానం వల్ల సామాన్యులకు కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే.. కొన్ని ప్రాంతాల్లో ఆధార్ నంబర్ల తప్పుల తడకలు, అప్డేట్ సమస్యలు, ఆధార్ కార్డ్ పోగొట్టుకోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఓటర్ ఐడీ నంబర్, బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను అనుసంధానించడం ద్వారా దొంగ పేర్లు, అర్హత లేని వ్యక్తులు లబ్ధి పొందకుండా మరింత పారదర్శకత వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నిజమైన అర్హులైన పేదలకు ఎటువంటి జాప్యం లేకుండా నేరుగా చేరేందుకు ఈ సరికొత్త విధానం దోహదపడుతుందని భావిస్తున్నారు. అయితే ఏయే స్కీమ్స్‌కి ఈ ఓటర్ ఐడీ విధానం వర్తింపజేస్తారనే దానిపై ప్రభుత్వం త్వరలో పూర్తి మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది.
