చంఢీఘర్: బహిరంగ చర్చకు రావాలంటూ ప్రధాని మోడీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విసిరిన సవాల్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ప్రతిపక్షాలు లేవనెత్తిన ఆందోళనలపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమని ప్రకటించారు. పార్లమెంట్లో ఫేస్ టూ ఫేస్ చర్చలో పాల్గొనాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు.
గురువారం (నవంబర్ 5) హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన బీజేపీ 'లోక్తంత్ర బచావో, అరాజకతా హటావో' (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, అరాచకాన్ని తొలగించండి) ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు, రాహుల్ గాంధీ లేవనెత్తిన ఆందోళనల్లో నిజం, నిజాయితీ ఉంటే పార్లమెంట్‌కు వచ్చి బాధ్యతయుతమైన చర్చలో పాల్గొనాలని సూచించారు. ప్రతిపక్షాలు కోరితే వారు లేవనెత్తిన సమస్యలపై కూలంకషంగా చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
Also Read : NVS-03 సక్సెస్.. ఇక స్వదేశీ 'నావిక్' సేవలు మరింత స్పీడ్!
పార్లమెంట్లో రాహుల్ గాంధీతో ఫేస్ టూ ఫేస్ చర్చకు రెడీ అని పేర్కొన్నారు. కానీ ప్రతిపక్షాలు, రాహుల్ గాంధీ మా సమాధానాలను తట్టుకోలేరని.. ఎప్పటిలాగే వారు సభ నుంచి పారిపోతారని ఎద్దేవా చేశారు. సమస్యలపై చర్చించడానికి, రాజ్యాంగ బాధ్యతలను నెరవేర్చడానికి పార్లమెంటే సరైన వేదికన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై ఇకనైనా అసత్య ప్రచారం చేయడం ఆపాలని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఇండియా కూటమి ర్యాలీ, ఆందోళనలు, బహిరంగ సభలు రాజకీయ జిమ్మిక్కులని అభివర్ణించారు.
పార్లమెంట్లో కీలకమైన అంశాలపై చర్చల్లో పాల్గొనడానికి నిరాకరిస్తూ బదులుగా పార్లమెంట్ బయట గొడవలు సృష్టించడం, వాకౌట్లు చేయడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతిగా మార్చేశారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ పార్లమెంట్‌ను అడ్డుకుంటూ వీధుల్లో అరాచకానికి పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై చర్చించడానికి, రాజ్యాంగ బాధ్యతలను నెరవేర్చడానికి పార్లమెంటే సరైన వేదిక అని హితవు పలికారు.
కాంగ్రెస్ నాయకత్వం సరైన రాజ్యాంగ పద్ధతుల ద్వారా కోరితే ఏవైనా ఆందోళనలను చర్చించడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని షా ప్రకటించారు. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల నుంచి గ్రామాలు, పొలాలు, రోడ్ల వరకు ప్రతిచోటా ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 'లోక్తంత్ర బచావో, అరజక్త హటావో ప్రచారానికి ప్రజల నుంచి బలమైన స్పందన లభించిందని తెలిపారు.
