- వాటి ఫొటోలు పంపాలని 25 వేల మందికి హౌసింగ్ బోర్డు మెసేజ్లు
- ఏ నియోజకవర్గానికి చెందిన పేదలకు అక్కడే ఫ్లాట్ కేటాయింపు
- అవగాహన లేక ఇతర నియోజకవర్గాలకు అప్లై చేసిన పబ్లిక్
- ఖైరతాబాద్ నియోజకవర్గంలో 180 మందికే అలాట్మెంట్
వెలుగు: ఇందిరమ్మ టవర్ల కేటాయింపులో హౌసింగ్ బోర్డు అధికారులు కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఏ నియోజకవర్గంలోని పేదలకు అదే నియోజకవర్గంలో ఫ్లాట్ కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు.
తొలి విడతలో కొన్ని నియోజకవర్గాల్లో ఇతర నియోజకవర్గాలకు చెందిన పేదలకు ప్లాట్స్ వచ్చాయని పలువురు ఎమ్మెల్యేలు హౌసింగ్ మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపధ్యంలో రెండో విడతలో ఇవి రిపీట్ కావొద్దని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఎమ్మెల్యేల అభ్యంతరం
క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్లను 20 నియోజకవర్గాల్లో నిర్మిస్తున్నారు. ఇందుకు భారీగా అప్లికేషన్లు వచ్చాయి. తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో నిర్మిస్తుండగా వీటిలో 7300 మందికి ఫ్లాట్స్ కేటాయించారు.
అయితే కొన్ని నియోజకవర్గాలకు చెందిన పేదలు పక్క నియోజకవర్గాల్లో అప్లై చేసుకోగా లాటరీలో ఫ్లాట్ దక్కింది. దీంతో ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ నియోజకవర్గంలో ఇతర నియోజకవర్గాల పేదలకు ఫ్లాట్ ఎలా కేటాయిస్తారని హౌసింగ్ అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు.
ఖైరతాబాద్, కూకట్ పల్లి నియోజకవర్గాల్లో ఈ వివాదం ఎక్కువ జరిగింది. ఖైరతాబాద్ లో మొత్తం 480 ఫ్లాట్స్ కేటాయించగా వారిలో 180 మంది మాత్రమే ఆ నియోజకవర్గానికి చెందిన వాళ్లు ఉన్నారని మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తప్పులు రిపీట్ కాకుండా..
రెండో విడత లాటరీలో ఇలాంటి తప్పులు రిపీట్ కాకుండా అధికారులు కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. పేదలు నివసిస్తున్న ప్రస్తుత ఇంటి లోకేషన్, కరెంట్ బిల్లును ఫోటో తీసి పంపాలని హౌసింగ్ బోర్డు అధికారులు 25 వేల మందికి మేసేజ్ లు పంపారు. వీటికి పబ్లిక్ నుంచి అనూహ్య స్పందన వచ్చిందని చెబుతున్నారు.10 రోజుల్లో 12 వేల మంది రిప్లై ఇస్తూ లోకేషన్, కరెంట్ బిల్లును పంపినట్లు హౌసింగ్ బోర్డు ఉన్నతాధికారి తెలిపారు. లోకేషన్ ఆధారంగా ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి అడ్రస్, నియోజకవర్గం సుళువుగా తెలుస్తుందని పేర్కొన్నారు.
రాజధాని పరిధిలో పారదర్శకంగా, అర్హులైన నియోజకవర్గ ప్రజలకే ఇందిరమ్మ టవర్లలో ఫ్లాట్లను కేటాయించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రంగంలోకి దించారు. ఈ సమస్యకు పరిష్కారంగా అధికారులు జియో-ట్యాగింగ్, జీపీఎస్ మ్యాపింగ్ టెక్నాలజీ వాడుతున్నారు.
దరఖాస్తుదారులు పంపిన లొకేషన్ మ్యాప్ ఆధారంగా దరఖాస్తుదారు ప్రస్తుతం ఏ నియోజకవర్గంలో నివసిస్తున్నారు? వారు అప్లై చేసుకున్న ఇందిరమ్మ టవర్ ఏ నియోజకవర్గం కిందకు వస్తుంది? స్థానిక నియోజకవర్గ ప్రజలకే ప్రాధాన్యం దక్కేలా కేటాయింపులు ఎలా చేయాలి? అనే అంశాలను సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్గా స్క్రీనింగ్ చేస్తున్నారు. దీంతో రెండో విడతలో ఏ నియోజకవర్గానికి చెందిన పేదలకు అదే నియోజకవర్గంలో ప్లాట్ కేటాయిస్తామని చెబుతున్నారు.
