- కేంద్రం తెచ్చిన కొత్త రూల్పై రాష్ట్ర రవాణా శాఖ కసరత్తు
హైదరాబాద్, వెలుగు: డ్రైవింగ్ లైసెన్స్‌లపై త్వరలో బ్లడ్ గ్రూప్, మొబైల్ నెంబర్ ముద్రించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రమాదాల సమయంలో బాధితుల బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడంలో ఆలస్యం కావడం, గాయపడినవారు స్పృహ కోల్పోయినప్పుడు వారి కుటుంబ సభ్యులకు వెంటనే సమాచారం అందించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను నివారించడమే ఈ రూల్ ప్రధాన ఉద్దేశం. బ్లడ్ గ్రూప్, మొబైల్ నెంబర్ వివరాలు అందుబాటులో ఉంటే అత్యవసర సమయంలో ప్రాణాపాయం నుంచి బాధితులను కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం.. తెలంగాణ రవాణా శాఖ జారీ చేయనున్న కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లపై కూడా బ్లడ్ గ్రూప్, మొబైల్ నెంబర్ అంశాలను తప్పనిసరిగా చేర్చనున్నారు. మొబైల్ నెంబర్ ద్వారా లైసెన్స్ రెన్యూవల్ తేదీలు, నిబంధనలు ఉల్లంఘించినప్పుడు విధించే జరిమానాల వివరాలను కూడా ఆన్‌లైన్‌లో పంపే వెసులుబాటు ఉంటుంది.
దీనికి సంబంధించి కేంద్రం నుంచి అధికారిక అమలు తేదీ ఉత్తర్వులు రాగానే..లైసెన్స్‌లపై బ్లడ్ గ్రూప్, మొబైల్ నెంబర్ వివరాలను ఎక్కడ ముద్రించాలనే దానిపై రాష్ట్ర రవాణా శాఖ అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. కేంద్ర మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించేలా.. లైసెన్స్ కార్డుపై ఈ వివరాలు స్పష్టంగా, సులువుగా కనిపించేలా రూపకల్పన చేసేందుకు అధికారులు
ప్లాన్ చేస్తున్నారు.
