- మోదీకి థ్యాంక్స్ చెబుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్
న్యూఢిల్లీ, వెలుగు: దీపావళి పండుగ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పన్నుల వాటాను ముందస్తుగా విడుదల చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వాస్తవానికి ఈ నెల 10న ఈ నిధులు విడుదల కావాల్సి ఉండగా, ప్రధాని నరేంద్ర మోదీ గురువారమే రిలీజ్ చేశారని చెప్పారు. పండుగ నేపథ్యంలో రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో ప్రధాని పెద్దమనసుతో ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.
మొత్తం రూ.1.09,019 కోట్ల నిధులు రిలీజ్ చేయగా.. ఇందులో తెలంగాణకు రూ.2,370 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,597 కోట్లు విడుదలయ్యాయి. పండుగల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ముందస్తు నిధుల విడుదల చాలా ఉపయోగకరంగా ఉంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తిని మనసా, వాచా, కర్మణా పాటిస్తూ.. రాష్ట్రాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిరంతరం అండగా నిలుస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మంత్రి కిషన్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేశారు.
