- సెల్ఫ్ బ్యూటిఫికేషన్ కోసం రూ.10 కోట్లు ఖర్చు పెట్టినోళ్లకు ఇప్పుడు ఉద్యమకారులు గుర్తొచ్చిన్రా?
- 320 మండలాల్లో కరువుంటే అమిత్ షా పైసా ఇయ్యలే
- ఎర్రవల్లి దూరమైతే జన్వాడ దగ్గరే ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ తీరు ‘ఉల్లిగడ్డ శాస్త్రం’లా మారిందని, ఇతరులకు సుద్దులు చెప్పడం తప్ప వాళ్లు పాటించరని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. గురువారం ఆమె పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆమె చిట్చాట్చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు నీతులు చెప్పడం మానుకోవాలన్నారు.
బీఆర్ఎస్నేతలు ఎదుటోళ్లకు సలహాలు చెబుతారు తప్ప పాటించడం లేదని ఫైర్ అయ్యారు. జనగామలో ఆత్మహత్య చేసుకున్న లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని ముందుగా పరామర్శించాలని, తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను పట్టించుకోవాలని, ఆ తర్వాత ఇతరులకు సలహాలు ఇస్తే బాగుంటుందన్నారు.
సెల్ఫ్ బ్యూటిఫికేషన్ కోసం ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు పెట్టే వారు ఇప్పుడు ఉద్యమకారుల గురించి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. వారికిచ్చిన హామీలను నెరవేర్చకుండా తప్పించుకునేందుకే ఎర్రవల్లి అంటూ మాట్లాడి విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు.ఎగ్గొట్టేందుకే ఎర్రవల్లి అంటున్నారు.. ఎర్రవల్లి దూరమైతే జన్వాడ దగ్గరే ఉందని సీఎం గుర్తుంచుకోవాలని కవిత సూచించారు.
పార్టీ పేరుపై ఈసీ నత్తనడక
తమ పార్టీ పేరు ఖరారు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నత్తనడకన సాగుతోందని కవిత అసహనం వ్యక్తం చేశారు. ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర సీఈఓను కలిసి అన్ని అంశాలను వివరించామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోపు పార్టీ పేరుపై ఈసీ నిర్ణయం తీసుకోక తప్పదని, త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. మియాపూర్ భూముల వ్యవహారంలో ఎవరు ఏం చేశారో అన్ని ఆధారాలతో సమయం వచ్చినప్పుడు కచ్చితంగా బయటపెడతానని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటీని సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు చెరబట్టి అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపించారు.
గ్రౌండ్ వాటర్ లేని ఆ ప్రాంతంలో ఒక్క ఇటుక కూడా పేర్చవద్దని హైకోర్టు ఆర్డర్ ఉన్నా పట్టించుకోకుండా సీఎం సోదరులే దగ్గరుండి పర్మిషన్లు ఇప్పిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గురుకుల ట్రస్ట్ భూముల్లో 700 వరకు అక్రమ నిర్మాణాలు జరిగాయని, ప్రస్తుతం మరో 80 భవనాలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. అక్రమంగా 10 అంతస్తుల భవనాలు నిర్మించి పీజీ హాస్టళ్లు, కాలేజీలు నడుపుతున్నారని, ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు.
అయ్యప్ప సొసైటీలోని ఖానామెట్ అక్రమ భవనాలపై సమగ్ర సర్వే చేసి నెల రోజుల్లో చర్యలు తీసుకోవాలని, లేదంటే తామే స్వయంగా వెళ్లి అక్రమ నిర్మాణాలకు రెడ్ మార్క్ వేస్తామని హెచ్చరించారు. తన వద్ద ఇంచు అసైన్డ్, ఇనాం భూమి ఉన్నా ప్రభుత్వానికే రాసిస్తానని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. కరువుతో అల్లాడుతున్న రాష్ట్రానికి పైసా సాయం చేయని బీజేపీ నేతలు నీళ్లు లేని బావిలో దూకాలన్నారు. రాష్ట్రంలో 320 మండలాలు కరువులో ఉంటే హైదరాబాద్ కు వచ్చిన అమిత్ షా పైసా సాయం ప్రకటించలేదని మండిపడ్డారు.
